2024లో టార్గెట్ చంద్రబాబు

Update: 2021-09-02 11:30 GMT
రాబోయే సాధారణ ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎట్టిపరిస్థితుల్లోను చంద్రబాబు నాయుడును ఓడించడమే టార్గెట్ గా అధికార వైసీపీ పావులు కదుపుతోంది. 2024 ఎన్నికల్లో కుప్పంలో భరత్ పోటీ చేయబోతున్నారంటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం గమనార్హం. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మీద పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి కొడుకే భరత్. అయితే భరత్ అభ్యర్ధిత్వాన్ని నేరుగా ప్రకటించలేదు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి జెయింట్ కిల్లర్ గా భరత్ అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ప్రకటించారు. వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్ పర్సన్ కే. వనిత అధ్యక్షతన కుల ప్రతినిధుల సమావేశం జరిగింది. అంటే వన్యకుల క్షత్రియులు బీసీ సామాజిక వర్గం లోకి వస్తారు. కుప్పంలో బీసీలు ప్రధానంగా వన్యకుల క్షత్రియుల సంఖ్య ఎక్కువగా ఉంది. నియోజకవర్గంలోని ఓటర్లలో మెజారిటీ ఎస్సీ, బీసీలదే. అందుకనే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా చంద్రమౌళిని పోటీలోకి దింపారు.

తన ప్రచారంతో చంద్రమౌళి ఒక దశలో చంద్రబాబుకు చెమటలు పట్టించారు. అయితే క్యాన్సర్ వైద్యం కారణంగా అభ్యర్థి మధ్యలోనే ఆసుపత్రిలో చేరాల్సొచ్చింది. దాంతో తండ్రి తరపున ప్రచార బాధ్యతను కొడుకు భరతే చూసుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మొదటి రెండు రౌండ్లు చంద్రబాబు సుమారు 8 వేల ఓట్లు వెనకబడిపోవటమే చంద్రమౌళి ప్రభావానికి నిదర్శనం. అనారోగ్యంతో చంద్రమౌళి ఆసుపత్రిలో చేరకపోతే చంద్రబాబు మరింత ఇబ్బంది పడేవారేమో.

గడచిన 30 ఏళ్ళల్లో ఏ ఎన్నికలోను చంద్రబాబు ఓట్లలో వెనకబడింది లేదు. ఓటర్ల ట్రెండు చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పావులు కదుపుతోంది. సంక్షేమ పథకాల అమలులో కుప్పంకు బాగా ప్రాధాన్యత ఇస్తోంది. స్ధానికంగా కావాల్సిన చిన్న చిన్న అభివృద్ధి పనులు, మంచినీటి సౌకర్యానికి నిధులు జగన్ వెంటనే మంజూరు చేశారు. కుప్పం మేజర్ పంచాయితిని మున్సిపాలిటీ చేయాలన్న దశాబ్దాల డిమాండ్ ను జగన్ నెరవేర్చారు.

భరత్ ను బలోపేతం చేయడం కోసం ప్రత్యేకంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెగ్యులర్ గా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. తన ప్రతి పర్యటనలోను భరత్ పాల్గొనేట్లుగా చూసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సామాజిక వర్గాలను వైసీపీలో చేర్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కనుక ఇప్పటినుండే ముందు జాగ్రత్త పడకపోతే వచ్చే ఎన్నికల్లో అనూహ్య ఫలితాన్ని చూడాల్సొస్తొంది.


Tags:    

Similar News