మోదీని తిట్ట‌లేక ఓడిపోయిన చంద్ర‌బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌

Update: 2021-02-17 17:30 GMT
నిజ‌మే... ఆంధ్రులంతా ఐక్యంగా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారును ప్ర‌శ్నించ‌లేక ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్... ముగ్గురూ ఓడిపోయార‌నే చెప్పాలి. కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌గా కొన‌సాగుతున్న విశాఖ ఉక్కుపై రాష్ట్రానికి ఎలాంటి అధికారం లేకున్నా... ఆంధ్రులంతా క‌లిసిక‌ట్టుగా పోరాడి సాధించుకున్న ఈ ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేట్ ప‌రం చేస్తున్న మోదీ స‌ర్కారును నిల‌దీసే విష‌యంలో ఈ ముగ్గురు నేత‌లు ఒకేలా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు నిజంగానే ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని చెప్పాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌పై మోదీ స‌ర్కారు త‌న‌దైన స్పీడులో దూసుకుపోతుంటే... ఇదేంట‌ని ప్ర‌శ్నించాల్సిన ఈ ముగ్గురు నేత‌లు మోదీని గానీ, ఆయ‌న నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వాన్ని గానీ ప‌ల్లెత్తు మాట కూడా అన‌లేని దుస్థితిలో కొన‌సాగుతున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. కేంద్రంపై పోరాడి విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు సంబంధించి మోదీని పున‌రాలోచ‌న‌లో ప‌డేయాల్సిన ఈ ముగ్గురు నేత‌లు... ఒకే రీతిన వ్య‌వ‌హ‌రిస్తూ... వారిలో వారినే తిట్టుకుంటూ కేంద్రాన్ని ప‌ల్తెత్తు మాట కూడా అన‌ని వైనం ఆస‌క్తిక‌ర‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

విశాఖ ఉక్కు ఏర్పాటు అంత ఈజీగా ఏమీ రాష్ట్రానికి రాలేదు. నాడు ఆంధ్రులంతా ఒక్కుమ్మ‌డిగా ఉద్య‌మించిన ఫ‌లితంగా నాటి ప్ర‌ధాని ఇందిరా గాంధీ దిగివ‌చ్చి మ‌రీ విశాఖ‌లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్ పేరిట ఉక్కు క‌ర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. క‌ర్మాగారాన్ని అయితే కేటాయించిన కేంద్రం... దానిని ఇనుప గ‌నుల‌ను మాత్రం కేటాయించ‌కుండా స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ను చూపించింది. ఫ‌లితంగా ఉత్ప‌త్తిలో గ‌ణ‌నీయ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తున్న విశాఖ ఉక్కు... సొంత గ‌నుల లేమి కార‌ణంగా ఎప్ప‌టిక‌ప్పుడు న‌ష్టాల‌నే చ‌విచూస్తోంది. విశాఖ ఉక్కుకు ఇనుప గ‌నుల‌ను కేటాయించాలని ఎప్పుడో ఒక‌సారి ఓ మాట అన‌డం మిన‌హా.. ఆ డిమాండ్ ను సాధించుకునే దిశ‌గా ఏపీ ప్ర‌జ‌లు గానీ, నేత‌లు గానీ ప‌క‌డ్బందీగా ఉద్య‌మం సాగించిన దాఖ‌లా లేద‌నే చెప్పాలి. అంతేకాకుండా ప్ర‌స్తుతం కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో కొన‌సాగుతున్న మోదీ స‌ర్కారుపై క‌నీస స్థాయిలో ఒత్తిడి తీసుకురాలేని వైనం ఏపీ ప్రాంతీయ పార్టీల్లో స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీ, బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతున్న జ‌నసేన‌... ఈ మూడు పార్టీలు ఈ విష‌యంలో ఒకేలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో పాటుగా నేల విడిచి సాము చేసిన‌ట్లుగా వారిలో వారిని ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకుంటూ సాగుతున్న వైనం నిజంగానే ఆశ్చ‌ర్యానికి గురి చేసేదేన‌ని చెప్పాలి.

గ‌తంలో చంద్ర‌బాబు బీజేపీతో క‌లిసి సాగారు. అయితే ఇప్పుడు బీజేపీతో బాబు పార్టీకి మైత్రి లేదు. అయినా కూడా ఎక్క‌డ తాను మోదీని విమ‌ర్శిస్తే త‌న‌కేం న‌ష్టం జరుగుతుందోన‌న్న భ‌యంతో బాబు మోదీపై ఒక్క మాట కూడా అనడం లేదు. అంతేకాకుండా మ‌రోమారు బీజేపీతో పొత్తు కోసం వెంప‌ర్లాడుతున్న కార‌ణంగానే మోదీపై బాబు విమ‌ర్శ‌లు చేసేందుకు వెనుకాడుతున్నార‌న్న వాద‌న‌లూ వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఏపీలో అధికార పార్టీగా కొత్త‌గా అవ‌త‌రించిన వైసీపీ కూడా మోదీ స‌ర్కారును నిల‌దీసే విష‌యంలో చొర‌వ చూప‌డం లేదు. బీజేపీతో మంచి సంబంధాలే కొన‌సాగిస్తున్న జ‌గ‌న్‌... ఎక్క‌డ తాను బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తే... త‌న కేసుల‌ను తిర‌గ‌దోడ‌తారేమోన‌న్న భ‌యంతో మోదీని ప‌ల్లెత్తు మాట కూడా అనడం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక ప్ర‌తి అంశంపై ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాన‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఇటీవ‌లే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా చంద్ర‌బాబు, జ‌గ‌న్ ల మాదిరే బీజేపీపై విమ‌ర్శ‌ల‌ను అస్స‌లు ప్ర‌స్తావించ‌డం లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా సాగుతున్న మోదీని వ‌దిలేసిన ఈ ముగ్గురు.. రాష్ట్రంలో ఓటు రాజ‌కీయాలకే ప్రాధాన్య‌మిస్తూ ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్న వైనం నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంద‌ని చెప్పాలి.




Tags:    

Similar News