హైద‌రాబాద్ ఆసుప‌త్రిలో తొలిసారి రోబో సేవ‌లు

Update: 2018-03-19 08:17 GMT
షాపుల్లో.. మాల్స్ లో.. ఆసుప‌త్రుల్లో రోబో సేవ‌ల గురించి చాలానే విని ఉంటారు. కానీ.. ఇప్పుడు చెప్పేది అందుకు కాస్త భిన్న‌మైంది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో తొలిసారి కొత్త త‌ర‌హా రోబో సేవ‌ల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఒక ప్రైవేటు ఆసుప‌త్రి. ఇంత‌కీ ఆ ఆసుప‌త్రి ఏమిటి?  ఎక్క‌డ ఉంది? అక్కడ రోబో ఏం చేస్తుంది?  అన్న వివ‌రాల్లోకి వెలితే..

ఐటీ కంపెనీలుండే రాయ‌దుర్గం ప్రాంతంలో స‌న్ షైన్ ఆసుప‌త్రి కొత్త త‌ర‌హా రోబో సేవ‌ల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఒక పేషెంట్ ఆసుప‌త్రిలోకి అడుగు పెట్టిన వెంట‌నే.. ద్వారం ద‌గ్గ‌ర రోబో స్వాగ‌తం ప‌లుకుతుంది. అత‌డి ముఖాన్ని స్కాన్ చేసుకొని.. వారి పేరు.. వివ‌రాలు.. ఫోన్ నెంబ‌ర్ల‌ను సేక‌రిస్తుంది. అనంత‌రం.. వారికి సంబంధించిన రికార్డును సిద్ధం చేసిన వెంట‌నే.. స‌ద‌రు రోగిని తీసుకొని సంబంధిత వైద్యుడి వ‌ద్ద‌కు తీసుకెళుతుంది.

ఒక‌సారి రోబో ద‌గ్గ‌ర త‌మ పేరు.. వివ‌రాలు ఇచ్చిన వారు త‌ర్వాత ఎప్పుడు వ‌చ్చినా.. వెంట‌నే గుర్తించి వారిని ప‌లుక‌రిస్తుంది. వారికి అవ‌స‌ర‌మైన వైద్య సేవ‌ల‌కు సంబంధించిన సాయం చేయ‌టంతో పాటు.. ఈ రోబో బీపీ కూడా చూస్తుంది. హైద‌రాబాద్ లోని టీ హ‌బ్ లో ఈ రోబోను త‌యారు చేశారు.

రోబో సాయంతో ఈ త‌ర‌హా సేవ‌ల్నిఅందించటం ద్వారా  రోగుల‌కు మ‌రింత చ‌క్క‌టి సేవ‌లు అందించే అవ‌కాశం ఉందంటున్నారు. రోబోకు ఉండే ప్ర‌త్యేక సెన్స‌ర్ ద్వారా రోగి బీపీ చెక్ చేస్తుంద‌ని చెబుతున్నారు. రానున్న రోజుల్లో రోబో త‌న‌తో పాటు.. తాను సేవ‌లు అందించిన రోగుల వివ‌రాల్ని కూడా ఉంచుకోవ‌టం.. వారు మ‌ళ్లీ ఆసుప‌త్రికి వ‌చ్చిన‌ప్పుడు వారి పాత నివేదిక‌ల్ని అందించ‌టం లాంటి సేవ‌లు చేసే వీలుంద‌ని చెబుతున్నారు. అన్ని బాగున్నాయి కానీ.. మ‌రి.. ఈ సేవ‌ల్ని పొందేందుకు వేసే ఛార్జిల మాట మాత్రం బ‌య‌ట‌కు రాలేదు.


Tags:    

Similar News