రాష్ట్రపతి భవన్ ముస్తాబు అవుతోంది అందుకేనా?

Update: 2016-06-29 16:24 GMT
కారణం లేకుండా ఏమీ జరగదు. తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వ్యవహారం కూడా ఇంతే. ఉన్నట్లుండి ఎలాంటి సమాచారం లేకుండా ఆ భవనాన్ని అందంగా ముస్తాబు చేయటం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడేమీ ప్రత్యేక కార్యక్రమాలు ఏమీ లేవు. మరి.. అలాంటప్పుడు రాష్ట్రపతి భవన్ ను ముస్తాబు చేస్తున్నారంటే ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఒకటి జరగనుందన్నది ఇప్పుడు చర్చగా మారింది.

ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రపతి భవన్ ముస్తాబు వెనుక.. మోడీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన క్యాబినెట్ ను పునర్ వ్యవస్థీకరణ చేసే దిశగా మోడీ తుది నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. తన క్యాబినెట్ ను ప్రక్షాళన చేయటం.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వటం ద్వారా.. ఆయా రాష్ట్రాలకు అమిత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలకాలన్న యోచనలో ఉన్నట్లుగా చెప్పొచ్చు.

పని తీరు సరిగా లేని వారిపై కొరడా విదల్చటం ద్వారా.. మిగిలిన వారందరికి ఇదో హెచ్చరికగా మారుతుంది. ఇక.. క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ పక్కా అని చెప్పటానికి మరో అంశం కూడా బలాన్ని చేకూర్చేలా ఉంది. గురువారం ఉదయం 10.30 గంటలకు జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసిన తీరు చూస్తే.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ రేపు ఉదయం ఉంటుందని తెలుస్తోంది. ఈ కారణం చేతనే రాష్ట్రపతి భవన్ ను ప్రత్యేకంగా అలంకరిస్తున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు. మరి.. అంచనాలు ఎంత నిజమన్నది కాస్త వెయిట్ చేస్తే తెలిసిపోతుందని చెప్పొచ్చు.
Tags:    

Similar News