వందేళ్ల నాటి ఆ ఉత్తరం ఖరీదు రూ.1.28కోట్లు?

Update: 2015-09-25 04:16 GMT
తాను రాసిన ఉత్తరానికి వందేళ్ల తర్వాత రూ.1.28కోట్ల విలువ ఉంటుందని ఉత్తరం రాసిన ఆయన కలలో కూడా అంచనా వేసి ఉండకపోవచ్చు. ఒక ఉత్తరం ఇంత ఖరీదు పలికే అవకాశం ఉందా? ఇంతకీ ఉత్తరం రాసిన ప్రముఖుడెవరు? ఆ ఉత్తరంలో పేర్కొన్న అంశాలేమిటి? లాంటి వివరాల్లోకి వెళితే..

ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ స్వహస్తాలతో రాసిన ఉత్తరం ఒకటి వేలం పాటలో 1,97,000 డాలర్లు (డాలర్ ఒకటికి రూ.65 చొప్పున లెక్కిస్తే..) పలికింది.  నాలుగు రోజుల క్రితం న్యూయార్క్ లో నిర్వహించిన వేలం పాటలో ఈ భారీ ధర పలికింది.

1880లో నవంబరు 23న ఫ్రాన్సిస్ మెక్ డెర్మాట్ అనే యువ న్యాయవాదికి రాసిన లేఖలో దేవుడికి సంబంధించిన అంశాల్ని డార్విన్ ప్రస్తావించారు. బైబి లోని కొత్త నిబంధనను మీరు నమ్ముతారా? నా ప్రశ్నకు మీరు అవును లేదా కాదు అని క్లుప్తంగా సమాధానం ఇస్తే చాలని డార్విన్ కు మెక్ డెర్మాట్ కోరితే.. అందుకు బదులుగా డార్విన్ జవాబు ఇచ్చారు.

ఇంతకూ డార్విన్ ఇచ్చిన సమాధానం ఏమిటని చూస్తే.. ‘‘బైబిల్ ను దైవ సందేశంగా బావించను. జీసస్ క్రైస్ట్ ను దేవదూతగా విశ్వసించను’’ అని డార్విన్  కుండ బద్ధలు కొట్టినట్లు తెలుస్తోంది. అయితే.. తాను రాసిన ఉత్తరాన్ని బయటకు రాకుండా చూడాలని డార్విన్ కోరటం.. అందుకు తగ్గట్లే ఆ ఉత్తరాన్ని బయటకు రాకుండా నాటి యువ న్యాయవాది చర్యలు తీసుకున్నారు.

కాలగర్భంలో కలిసిపోయిన ఆ ఉత్తరం నాటకీయంగా వందేళ్ల తర్వాత బయటకు వచ్చింది. దాన్ని తాజాగా వేలం వేస్తే.. ఇంత భారీ ధర లభించింది. ఉత్తరం రాసిన డార్విన్ మాత్రమే కాదు.. తాను వేసిన ప్రశ్న.. ఇంత ఖరీదైన ఉత్తరంగా మారుస్తుందని సదరు యువ న్యాయవాది కూడా అనుకొని ఉండకపోవచ్చు.
Tags:    

Similar News