`చార్మినార్`లో `ఇవాంకా`గాజుల గ‌ల‌గ‌ల‌లు!

Update: 2017-11-28 07:20 GMT
నేటి నుంచి మూడు రోజుల‌పాటు హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)కు తెలంగాణ స‌ర్కార్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. జీఈఎస్‌ లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె - సలహాదారు ఇవాంక ట్రంప్ న‌గ‌రానికి తొలిసారి రాబోతుండ‌డంతో ఆమె కోసం న‌గ‌రాన్ని ముస్తాబు చేసింది. అయితే, ఇవాంకా రాక కోసం స‌ర్కార్ తో పాటు కొంత‌మంది చిరు వ్యాపారులు కూడా వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఇవాంకా త‌మ ప్రాంతంలో ప‌ర్య‌టించ‌నుంద‌నే వార్త‌లు రావ‌డంతో ఆమెకు ప్ర‌త్యేక బ‌హుమ‌తులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ బహుమ‌తులను రూపొందించ‌డం కోసం త‌మ‌లోని క్రియేటివిటీకి ప‌దునుపెట్టారు.

కాస్మోపాలిట‌న్ సిటీ హైద‌రాబాద్ పేరు చెప్ప‌గానే ముందుగా గుర్తుకు వ‌చ్చే చారిత్ర‌క క‌ట్ట‌డం చార్మినార్. భాగ‌మ‌తి పేర నిర్మించిన‌ భాగ్య‌న‌గ‌రంలోని  చార్మినార్ ను ఇవాంకా సంద‌ర్శించే అవ‌కాశాలుండ‌డంతో ఈ చారిత్ర‌క క‌ట్ట‌డం ద‌గ్గ‌ర కూడా అధికారులు భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించే సంద‌ర్భంగా గాజులకు ప్రసిద్ధిగాంచిన లాడ్‌ బజార్ లో ఇవాంకా షాపింగ్‌ చేస్తుందనే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో, అక్కడి వ్యాపారులు ఇవాంకాకు ఓ మ‌ర‌పురాని బ‌హుమ‌తిని ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. లాడ్‌ బజార్‌ వ్యాపారులు త‌మ క్రియేటివిటీని ఉప‌యోగించి ఇవాంకా, 'భారత-అమెరికా స్నేహం' పై ప్రత్యేకంగా గాజులు తయారు చేశారు. గాజుల మీద ఇవాంకా పేరుతో పాటు ఇండియా - అమెరికా జాతీయ జెండాలను డిజైన్ చేశారు. ఇవాంకా కోసం ఈ ప్ర‌త్యేక‌మైన గాజుల సెట్‌ ను తయారు చేయడానికి 45 రోజులు పట్టింద‌ని, ఆమె లాడ్‌ బజార్‌ ను సందర్శిస్తే ఈ గాజులను అమెకు బహుమతిగా ఇస్తామ‌ని అక్క‌డి వ్యాపారులు చెబుతున్నారు. ఇవాంకా పేరుతో రూపొందించిన గాజులు ఇపుడు చార్మినార్ ప్రాంతంలో హాట్ టాపిక్ గా  మారాయి.
Tags:    

Similar News