పీకేపై చీటింగ్ కేసు... అసలేం జరిగిందంటే?

Update: 2020-02-27 09:32 GMT
ఎన్నికల వ్యూహకర్తగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివాదం ఆయనను ఏ మేర ఇబ్బంది పెడుతుందో తెలియదు గానీ... ఆయనపై ఏకంగా చీటింగ్ కేసు అయితే నమోదైపోయింది. ఏ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసినా... ఆ పార్టీని జనంలోకి చొచ్చుకెళ్లేలా చేసేందుకు పీకే టీమ్... ఓ వినూత్న నినాదాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే కదా. 2014లో బీజేపీకి పీకే టీమ్ ‘చాయ్ పే చర్చా’ అంటూ ఇచ్చిన చేసిన ప్రచారం ఓ రేంజిలో పనిచేసిన సంగతి తెలిసిందే. అలాంటి పీకే ఇప్పుడు మరొకరి నినాదాన్ని కాపీ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ క్రమంలోనే ఆయనపై బీహార్ పోలీసులు ఏకంగా చీటింగ్ కేసు పెట్టేశారు.

ఈ వివాదం పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రశాంత్ కిశోర్ టీమ్ తన ఐడియాను కాపీ చేసి ‘బాత్‌ బిహార్‌ కీ’ కార్యక్రమాన్ని రూపొందించారంటూ బిహార్‌ మోతీహారీకి చెందిన గౌతమ్‌ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి ‘బాత్‌ బిహార్‌ కీ’ కార్యక్రమం తన ఆలోచనల్లో రూపుదిద్దుకుందని, కానీ, తన మాజీ సహోద్యోగి అయిన ఒసామా అనే వ్యక్తి ఆ ఐడియాను ప్రశాంత్‌ కిషోర్‌ కు చెప్పాడన్నది గౌతమ్‌ ఆరోపణ. తాను ‘బిహార్‌ కీ బాత్‌ ’ అనే కార్యక్రమాన్ని జనవరి నెలలో ప్రారంభిస్తే.. పీకే టీమ్ దానిని ‘బాత్ బీహార్ కీ’ అంటూ మార్చేసుకుని కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెలలో ప్రారంభించాడని గౌతమ్ ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా గౌతమ్ పోలీసులకు అందజేశాడు.

గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకున్న పోలీసులతు 402, 406 సెక్షన్ల కింద ప్రశాంత్‌ కిషోర్‌, ఒసామాలపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా దీనిపై పోలీసులు విచారణను కూడా ప్రారంభించేశారు. దేశంలోని ప్రధాన పార్టీలకు ఇప్పటికే తనదైన వ్యూహాలు ఇచ్చిన ప్రశాంత్ కిశోర్... తన వర్క్ ను మరిన్ని పార్టీలకు విస్తరిస్తున్నారు. దేశంలోని పలు పార్లీల నుంచి వస్తున్న ఆఫర్లతో ఊపిరి సలపలేనంత బిజీగా మారిపోయిన ప్రశాంత్ ఈ కేసు వల్ల ఏ మేర ఇబ్బంది పడతారోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా ఏ ఒక్కరికి సాధ్యం కాని వ్యూహాలను రచిస్తున్న పీకే... అదే వ్యూహాల కాపీకి సంబంధించి చీటింగ్ కేసు ఎదుర్కోవాల్సి రావడం నిజంగానే ఆశ్చర్య కరమే.
Tags:    

Similar News