క‌రోనాకు వ్యాక్సిన్ తోనే చెక్‌... మ‌రి ఏది బెస్ట్‌?

Update: 2021-06-18 03:30 GMT
ఉరుము లేని పిడుగులా వ‌చ్చి ప‌డిన క‌రోనా వైర‌స్ యావ‌త్తు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఈ వైర‌స్ నుంచి త‌మ‌ను తాము కాపాడుకునేందుకు అన్ని దేశాల పౌరులు త‌మ‌కు అందుబాటులో ఉన్న ఏదో ఒక త‌రుణోపాయాన్ని ఆశ్ర‌యిస్తున్నారు. అంతిమంగా త‌మ‌కు అందుబాటులోకి వ‌చ్చిన వ్యాక్సిన్ తీసుకుని... క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. ఇక్క‌డే అస‌లు సిస‌లు స‌మ‌స్య మొద‌లవుతోంది. అందుబాటులో ఒక‌టే వ్యాక్సిన్ ఉంటే స‌మ‌స్య లేదు గానీ... ఒక‌టికి మించి వ్యాక్సిన్లు ఉంటే... వాటిలో ఏది మంచిది?  దేని పనితీరు ఎలా ఉంటుంది? ఏది వేసుకుంటే మెరుగైన ర‌క్ష‌ణ ల‌భిస్తుంది?... త‌దిత‌ర ప్ర‌శ్న‌ల‌తో జ‌నం స‌త‌మ‌తమ‌వుతున్నారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితి మ‌న దేశంలో చాలా ఎక్కువ‌గానే ఉంది. ఎందుకంటే... ప్ర‌స్తుతం మ‌న‌కు మూడు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి.

స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో అభివృద్ధి అయిన కోవాగ్జిన్ తో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి.. ఇలా మూడు వ్యాక్సిన్లు ప్రస్తుతం మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. మ‌రి వీటిలో దేనిని తీసుకుంటే మంచిది?  దేనితో ఎక్కువ మేర ర‌క్ష‌ణ ల‌భిస్తుంది?  దేని ప‌నితీరు ఎలా ఉంది? అనే ప్ర‌శ్న‌ల‌తో మ‌న దేశ పౌరులు గందర‌గోళానికి గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయా వ్యాక్సిన్ల ప‌నితీరుపై ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల అవుతున్న నివేదిక‌ల‌పై జ‌న‌మంతా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

కోవిషీల్డ్‌ను ప్రపంచంలోని చాలా దేశాల్లో వినియోగిస్తున్నారు. ఈ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం ఉంది. తెలుగు నేల‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ ఉత్ప‌త్తి అయిన కోవాగ్జిన్‌ను ప్రస్తుతం భారత్‌లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ ఇది వివిధ రకాల వైరస్ మ్యుటేషన్లతో పోరాడగలదని చాలా పరిశోధనల్లో తేలింది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు కూడా భారత్‌తో పాటు మరో 60కి పైగా దేశాల్లో ఆమోదం లభించింది. ఈ మూడే కాకుండా కొన్ని దేశాల్లో అందుబాటులో ఉన్నఫైజర్ వ్యాక్సిన్ 95 శాతం సమర్థతతో పనిచేస్తోంది. కోవిషీల్డ్ 60-90 శాతం ప్రభావవంతంగా ఉంటోంది. ఈ త‌ర‌హా అంచ‌నాల‌న్నింటికీ ఆయా వ్యాక్సిన్ల‌పై జ‌రుగుతున్న క్లినిక‌ల్ ట్రయ‌ల్సే ప్రామాణికం. అయితే ఈ ట్ర‌యల్స్  వేర్వేరు ప్ర‌దేశాలు, వేర్వేరు జాతులు, వేర్వేరు వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో జ‌రుగుతున్న‌వే కావ‌డంతో వీటినీ అంత‌గా ప్రామాణికంగా తీసుకోవ‌డానికి కూడా లేదు.

అయితే ఏ వ్యాక్సిన్ అయినా.. మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించే క‌రోనా వైర‌స్ ను నిరోధించేందుకే క‌దా. ఆయా వ్యాక్సిన్లు ఏ ప‌ద్ద‌తిన త‌యారు చేసినా... వాటి అంతిమ ల‌క్ష్యం క‌రోనా వైర‌స్ ను అడ్డుకుని మ‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డ‌మే క‌దా. అంతేకాకుండా ఏ వ్యాక్సిన్ అయినా... సుదీర్ఘ ప‌రిశోధ‌న‌ల త‌ర్వాతే బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ క్ర‌మంలో అందుబాటులో ఉండే ఏ వ్యాక్సిన్ అయినా వేసుకోవాల‌ని, ఏ వ్యాక్సిన్ అయినా... క‌రోనా నుంచి మ‌న‌ల‌ను ర‌క్షించేందుకేన‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ ల‌భించ‌క చాలా దేశాల ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతుంటే...అందుబాటులో మూడు ర‌కాల వ్యాక్సిన్ల‌ను పెట్టుకుని దేనిని వేసుకోవాలి?  దేని ప‌నితీరు ఎలా ఉంటుంది? అన్న విష‌యాల‌ను ప‌క్క‌న‌పెట్టేసి ముందుగా ఏదో ఒక వ్యాక్సిన్ ను వేసుకుని క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందాల‌ని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News