ఎల్‌ జీ పాలిమర్స్‌ భాదితులకు మరో సమస్య..ఏంటంటే ?

Update: 2020-05-11 08:15 GMT
గతవారం విశాఖపట్నంలో గ్యాస్ లీక్  ఘటనలో 12 మంది చనిపోగా వందలాది మంది ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. వీరిలో స్వల్ప అస్వస్థతకు గురైన వారిని డిశ్చార్జి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండడంతో వీరిలో ఇప్పుడు సరికొత్త ఆందోళన మొదలయ్యింది. కంపెనీ చుట్టూ ఉన్న ఐదు ప్రభావిత గ్రామాల్లోకి వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో డిశ్చార్జి చేస్తే ఎక్కడికి వెళ్లాలి అన్నది బాధితుల ప్రశ్న.

ఈ దుర్ఘటన అస్వస్థతకు గురైన వారు ఆస్పత్రుల్లో చేరగా, వారి కుటుంబ సభ్యుల్లో కొందరు బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో అందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో ఓ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఎవరికైనా కష్టమని, ఇప్పటికే ఉన్న వారిని మానవతా దృక్పథంతో ఆదుకుంటున్నారని, కొత్తగా తాము కూడా అక్కడకు ఎలా వెళ్లగలమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడిందని, అందువల్ల డిశ్చార్జి చేస్తున్నామని స్పష్టంగా చెబుతున్న అధికారులు తమకు ఎక్కడైనా ప్రత్యేక వసతి కల్పించాలని వేడుకుంటూ ఉంటే నీళ్లు నములుతున్నారని  వాపోతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఆస్పత్రిలో ఉండక, సొంత ఊరికి వెళ్లలేక, తామెక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. కొన్నిరోజుల తర్వాతైనా ఊర్లోకి వెళ్లాలని అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారని, కానీ దుర్ఘటన పీడకలలా వెంటాడుతుంటే గ్రామాల్లో మళ్లీ నివసించాలంటే ధైర్యం చాలడం లేదని చెబుతున్నారు.   తమ మనోవేదన, భయాన్ని జిల్లా యంత్రాంగం అధికారులు అర్థం చేసుకుని కంపెనీని అక్కడి నుంచి తరలించే వరకు తమకు శాశ్వత పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News