చెన్నై వరద నష్టం రూ.లక్ష కోట్లా..?

Update: 2015-12-07 03:42 GMT
వారం పాటు విడవకుండా కురిసిన వాన.. ఒక్కసారిగా మీద పడ్డ వరద పోటుతో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరం అతలాకుతలం కావటమే కాదు.. మరికొన్నాళ్ల వరకూ కోలుకోలేనంత భారీ దెబ్బ పడిందంటున్నారు. ఏరియల్ వ్యూలో చూసినప్పుడు ఓపక్క సముద్రం.. మరోపక్క భారీ భవంతులతో.. పెద్ద ఎత్తున భవనాలతో బొమ్మరిల్లును తలపించేలా కనిపించిన చెన్నై మహానగరం.. ఇప్పుడు అందుకు భిన్నమైన సీన్ కనిపిస్తోంది. ఏరియల్ వ్యూలో అటు సముద్రపు నీరు.. ఇటు వరద నీట మునిగి చెన్నై మహానగరి.. మొత్తంగా నీళ్లు మాత్రమే కనిపించే పరిస్థితి.

వరదల కారణంగా.. దాదాపు కోటికి పైనే ప్రత్యక్షంగానూ.. పరోక్షంగా ప్రభావం చూపించింది.  వరదల కారణంగా చెన్నై మహానగరికి కలిగిన నష్టం ఎంతన్నది ఇప్పుడు లెక్కించటం కష్టమైంది. ఎందుకంటే.. మహానగరిలో వరద కారణంగా నష్టపోని వారు ఎవరూ లేకపోవటమే. నిజానికి చెన్నై మహానగరితో పాటు.. తమిళనాడులోని పలు ప్రాంతాలు తీవ్రంగానే ప్రభావితం అయ్యాయి. అయితే.. మహానగర రూపురేఖలు మార్చేసే స్థాయిలో నష్టం వాటిల్లటంతో.. ఇప్పుడు అందరి దృష్టి చెన్నై మీదనే ఉంది.

దాదాపు ఐదు రోజుల పాటు నరకం అంటే ఏమిటో చూసిన చెన్నై ఇప్పుడిప్పుడే కోలుకొంటోంది. బాధితుల సంఖ్య లక్షల్లో ఉండటంతో సహాయ కార్యక్రమాలు అందటం కాస్త కష్టంగా మారింది. సినీతారలు.. వ్యాపార వర్గాలు మొదలు.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా సహాయక కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ఎంతమంది ఎంతగా స్పందించినా.. బాధితుల ఆకలి కేకలు తీరని పరిస్థితి. ఎందుకంటే.. వరద బీభత్సం కారణంగా చెన్నై మహానగరానికి కలిగిన నష్టం ఏకంగా లక్ష కోట్ల రూపాయిల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నష్టం ప్రభుత్వానికి.. ప్రజలకు కలిగిందిగా చెప్పొచ్చు. అధికారికంగా తమిళనాడుకు వాటిల్లిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. అయితే.. వరదల కారణంగా జరిగిన నష్టంతో పాటు.. పునరావాస కార్యక్రమాల కోసం వెచ్చించే మొత్తం మొదలు.. వరద కారణంగా ఆగిన దినసరి కార్యకలాపాలు లెక్కిస్తే.. నష్టం రూ.లక్ష కోట్లకు పైనే ఉంటుందన్న అంచనా వినిపిస్తోంది.

చెన్నై శివారుల్ని అమితంగా ప్రభావితం చేసిన ఈ వరదల కారణంగా కలిగిన నష్టం నుంచి అటు తమిళనాడు ప్రభుత్వం కానీ.. ఇటు తమిళ ప్రజలు కానీ ఇప్పట్లో కోలుకోలేరన్న మాట వినిపిస్తోంది. ఒకవైపు వర్షం కురుస్తున్నా.. వరద పోటు తగ్గుముఖం పట్టటంతో.. సహాయక చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి. జనజీవనంలో కొంతలో కొంత మార్పు వచ్చింది. బస్సులు తిరుగుతుంటే.. రైళ్ల రాకపోకలు పాక్షికంగా షురూ అయ్యాయి.విమాన సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. మొత్తంగా ఇప్పుడిప్పుడే భారీ షాక్ నుంచి చెన్నై మహానగరి కోలుకుంటోంది.

అయితే.. చెన్నై శివారులో పరిస్థితిలో ఇప్పటికి దయనీయంగానే ఉంది. వరద నీటి ప్రభావం పూర్తిగా పోని పరిస్థితి నెలకొంది. ఆహారం.. మంచినీటి కోసం జనం పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో సాయం కోసం ఎదురుచూస్తుండటంతో.. సాయంగా వచ్చిన వాటిని ఎంతగా పంపిణీ చేసినా బాధితుల ఆకలి కేకలు మాత్రం తీరటం లేదు. వరద పోటు నుంచి చెన్నై మహానగరి కోలుకోవటం ఇప్పటికిప్పుడు అయ్యేటట్లుగా కనిపించటం లేదు.
Tags:    

Similar News