లేటెస్ట్..; చెన్నైలో అసలేం జరుగుతోంది..?

Update: 2015-12-02 09:49 GMT
ఎంతకూ విడవని వానతో విలవిలలాడిపోతున్న చెన్నైలో కేవలం 24 గంటల వ్యవధిలో (మంగళవారం ఒక్కరోజులో) 120 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో.. చెన్నై మొత్తంగా మునిగిపోయింది. రోడ్లు అన్నవి కనిపించకుండా జలమయం అయితే.. లోతట్లు ప్రాంతాలు ఏకంగా చెరువులుగా మారిపోయాయి. ఇక.. చెన్నై విమానాశ్రయంలో రన్ వే మీద నిలిచిన వర్షపు నీరు కారణంగా  విమానాలు..  పడవల మాదిరిగా కనిపించే పరిస్థితి. తాత్కలికంగా ఎయిర్ పోర్ట్ ను మూసేసిన సంగతి తెలిసిందే.

ఇంత భారీ స్థాయిలో వర్షం విరుచుకుపడిన నేపథ్యంలో చెన్నైలో తాజా పరిస్థితి ఎలా ఉంది? ఏం జరుగుతుంది? ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి? సగటు చెన్నై వాసి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలకు సమాధానాలు చూస్తే..

= వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరో మూడు.. నాలుగు రోజులు భారీ వర్షాలు తప్పవని చెబుతున్నారు.

= బీబీసీ హెచ్చరిక ప్రకారం అయితే.. రానున్న మూడు రోజుల్లో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచొచ్చని చెబుతోంది.

= వీలైనంతవరకు నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచుకోవటం మంచిదని సూచిస్తున్నారు.

= అడయార్ నది పొంగటంతో దాదాపు 4 లక్షల ఇళ్లు నీట మునిగిన పరిస్థితి.

= చెన్నై ఎయిర్ పోర్ట్ లో దాదాపు 700 మంది చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా విమాన సర్వీసుల్ని నిలిపివేయటంతో పాటు.. విమానాశ్రయాన్ని తాత్కలికంగా మూసివేశారు. ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా తరలించేందుకు విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

= రానున్న మూడు.. నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. మూడు నాలుగు రోజుల వరకూ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

= సహాయక చర్యల కోసం రెండు కంపెనీల కేంద్ర బలగాలు తమిళనాడుకు తరలించారు

= రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. ముందస్తు జాగ్రత్తగా పలు రిజర్వాయర్ల నీటిని విడుదల చేయటంతో సమీపంలోని దిగువున ఉన్న ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోతున్నాయి.

= చెన్నై నగర శివారులో ఉన్న రిజర్వాయర్లతో పాటు అడయార్ నది నిండిపోయింది.ఆ వరద నీరు చెన్నై నగరంలోకి ప్రవేశించింది. దీంతో.. చాలా ప్రాంతాల్లో వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో 5 నుంచి 6 అడుగుల ఎత్తులో వర్షపునీరు నిలిచిపోయిన దుస్థితి.

= రవాణా వ్యవస్థ స్తంభించిపోవటం.. వాహనాలేమీ నడవలేని పరిస్థితుల్లోచాలా ప్రాంతాల్లో రవాణా కోసం.. సహాయక చర్యల కోసం పడవల్ని వినియోగిస్తున్నారు.

= లోతట్లు ప్రాంతాల్లోని ఉన్న బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించలేని దుస్థితి. ఆర్మీ.. జాతీయ విపత్తు దళం రంగ ప్రవేశం చేసినా కూడా సహాయక చర్యలు అందించలేని పరిస్థితి. వరద నీటి తీవ్రత ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.

= రెండు రోజులుగా విద్యుత్తును నిలిపివేశారు. రానున్న రోజుల సంగతి అర్థం కాక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

= భారీ వర్షాల కారణంగా భూగర్భ కేబుల్ వ్యవస్థ దెబ్బ తిని పలుప్రాంతాల్లో ఫోన్లు పని చేయని పరిస్థితి.

= చెన్నై వర్ష తీవ్రత ఎంత అంటే.. సేఫ్ ప్లేస్ గా భావించే చెన్నై విమానాశ్రయం కూడా మునిగిపోయిందంటే వర్షపు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

= దాదాపుగా 70వేల మంది సహాయక కార్యక్రమాల్లో మునిగిపోయారు.

= భారీ వర్షాల కారణంగా భయంతో సిటీని వదిలి వెళ్లాలన్నా.. బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొని ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురి అవుతున్నారు.

= వర్షాలు ముందు తగ్గుముఖం పట్టటమే చెన్నైసమస్యకు పరిష్కారంగా చెబుతున్నారు. వర్షం కనుక జోరుగా సాగితే మాత్రం మరిన్ని తిప్పలు తప్పవని.. సహాయక చర్యలు కూడా అందించలేని పరిస్థితి ఉంటుందంటున్నారు.

= ఈ భారీ వర్షాల కారణంగా దాదాపు 40 లక్షల మంది చెన్నై నగర ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేకపోతున్నారన్నది ఒక అంచనా.

= బహుళ అంతస్తుల్లో ఉన్న వారి పరిస్థితి కాస్త బాగుంది. మిగిలిన వారు మాత్రం ఒకటి.. రెండో అంతస్థులో తలదాచుకునే పరిస్థితి.
Tags:    

Similar News