కదలించే చెన్నై సాఫ్ట్ వేర్ రియల్ అనుభవం

Update: 2015-12-06 11:05 GMT
ఏకధాటిగా కురిసిన వర్షాలు.. ఆపై వచ్చిన వరదతో చెన్నై మహానగరానికి ఎంత పెద్ద కష్టం వచ్చిందన్న విషయం మీడియాలో వార్తలు చూసే వారికి.. సోషల్ మీడియాను సీరియస్ గా ఫాలో అయ్యే వారికి చాలా బాగానే తెలుసు. చెన్నై నగరాన్ని అతలాకుతలం చేయటంతో పాటు.. తమిళనాడుకు దాదాపుగా రూ.50వేల కోట్ల నష్టాన్ని మిగిల్చిన ఈ విపత్తు కారణంగా 500 మందికి పైనే మరణించారు.

మరణించిన వారి విషాదం ఒక పక్క.. బతికి ఉన్న వారి బాధలు మరోపక్క.. మొత్తంగా చెన్నైలోని సగటుజీవి మదిలో ఎన్నో ఆలోచనలు.. మరెన్నో భావాలు. అలాంటి వాటిని అక్షరబద్ధం చేస్తూ.. తాము ఏమనుకుంటున్నామో నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. నిన్నటి వరకూ యాంత్రిక జీవితం గడిపి.. కెరీర్ లక్ష్యంగా దూసుకెళ్లిన వేలాది మందిలో సరికొత్త అంతర్మధనం మొదలైంది.

తమలోని భావాల్ని సోషల్ మీడియాలో చెబుతున్న వారు ఎందరో. అలంటి వారిలో ఒకరి ‘‘ఫీలింగ్స్’’ పలువురిని కదిలిస్తున్నాయి. చెన్నైలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని తన అనుభవాన్ని చెప్పుకొచ్చిన ఆ వ్యక్తి చెప్పిన మాటలు చూస్తే.. చెన్నైలోని వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలిసిపోతుంది.  చెన్నైయేట్స్ పేరిట ఉన్న హ్యాష్ ట్యాగ్ లో ‘‘నా కథ’’ అంటూ ప్రసన్న వెంకటరాం అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పెట్టిన పోస్టింగ్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

ఆయనేమన్నారో.. ఆయన మాటల్లోనే చెబితే..

‘‘నేను ప్రసన్న వెంకటరాం. ఓ అమెరికన్ సాఫ్ట్ వేర్ కంపెనీలో సిస్టం అనలిస్ట్ గా చెన్నైలో పని చేస్తున్నా.  ఏడాదికి 18 లక్షల జీతం. ట్రిపుల్ బెడ్ రూంకి ఓనర్ని. ఈ రోజు నాకు రెండు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. లక్ష రూపాయల కంటే ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉంది. బ్యాంకులో 65 వేల క్యాష్ బ్యాలెన్స్ ఉంది. భారీ వర్షాల కారణంగా నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నా. నేనిప్పుడు బతకానికి నాకు కాసిన్ని నీళ్లు.. ఆహారం కావాలి. వారం కిందట వరకూ కూడా నేను జాబ్ లో అప్రైజల్ గురించి తెగ ఆలోచిస్తుండేవాడిని. తీవ్ర ఆందోళనతో గడిపేవాడిని. కనీసం 15 శాతం శాలరీ హైక్ వస్తుందన్న అంచనాలతో ఉన్నా. కానీ.. ఈ రోజు నేను మా బిల్డింగ్ టెర్రస్ మీద నిలుచొని  ఎదురుచూస్తున్నా.. వాటర్.. ఫుడ్ ప్యాకెట్ కోసం. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్."
Tags:    

Similar News