తెలంగాణలో కొత్త పార్టీ...జూన్ 2న ప్రారంభం

Update: 2017-05-09 06:05 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ఆప్తుల్లో మ‌రొక‌రు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా సొంత వేదిక‌ను మొద‌లుపెట్టారు. సీఎం కేసీఆర్ స‌న్నిహితుడిగా పేరున్న టీఆర్ఎస్‌ మాజీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు చెరుకు సుధాకర్ త‌న పార్టీ ప్ర‌క‌ట‌న చేశారు. టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అనంత‌రం త‌న సొంత పార్టీని ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన చెరుకు సుధాక‌ర్ తాజాగా జూన్ 2 పార్టీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణ ఇంటిపార్టీ కన్వీనర్‌గా ఉన్న చెరుకు సుధాక‌ర్ గన్‌పార్క్‌ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జెండా ఊపి బస్సుయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. ఎంతో మంది అమరులు పోరాడితే ఈ స్వప్నం సాకారమైందని చెప్పారు. అమరులు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యతను తాము తీసుకున్నామని అన్నారు. బంగారు తెలంగాణ అంటే అట్టడుగువర్గ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడమని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదన్నారు.

ఇప్పుడున్న ప్రభుత్వానికి 2001లో పుట్టిన టీఆర్‌ఎస్‌కున్న లక్షణాల్లేవని చెరుకు సుధాక‌ర్ వ్యాఖ్యానించారు. పార్టీ నడపాలన్నా, ఎన్నికల్లో పోటీ చేయాలన్నా డబ్బు కావాలంటున్నారని, 60 ఏళ్ల‌ నుంచి కొట్లాట పైసలతో నడవలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సమయంలో డబ్బులెక్కడున్నాయని ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే పోరాటాల వారసత్వమని అన్నారు. సామాజిక న్యాయం, సబ్బండవర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఆత్మాభిమానం చంపుకొని కొందరు టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారని చెప్పారు. జేఏసీలో పనిచేసిన వారు రాజకీయ అనాధలుగా మిగిలిపోయారని అన్నారు. అలాంటి వారందరికీ రాజకీయ వేదికే తెలంగాణ ఇంటిపార్టీ అని చెప్పారు. రాజకీయ అధికారంలో భాగస్వాములు కావాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని ఆకాంక్షించారు. రాజకీయాలను శాసిస్తే 2019లో నిర్ణయాత్మక శక్తిగా మారతామని అన్నారు. తెలంగాణ ఇంకా సీమాంధ్రుల ఆధిపత్యమే కొనసాగుతోందని చెప్పారు. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యల్లేవని విమర్శించారు.

ప్రజల ఆకాంక్షలకు కాకుండా కుటుంబ ఆకాంక్షలకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెరుకు సుధాక‌ర్ విమర్శించారు. ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి, భరోసా కల్పించేందుకు బస్సుయాత్ర చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించడం లేదన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు యధేచ్చగా సాగుతున్నాయని చెప్పారు. పౌరహక్కులను కాలరాస్తున్నారని అన్నారు. రాష్ట్రమంతా ఈ బస్సుయాత్ర జూన్‌ 1వ తేదీ వరకు తిరుగుతుందని అన్నారు. జూన్‌ 2న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో తెలంగాణ ఇంటిపార్టీ ఆవిర్భావ సభ ఉంటుందని చెప్పారు.
Tags:    

Similar News