చంద్రబాబు సింగపూర్ లా ఎందుకుచేస్తారంటే...

Update: 2016-09-21 05:10 GMT
ఆంధ్రప్రదేశ్ లో వైకాపా తరుపున కాస్త గట్టిగా మాట్లాడేవారిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు. అధికారపక్షం పోకడలపై నిత్యం తన గళం వినిపించడంలో ముందుండే చెవిరెడ్డి.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైర్స్ వేశారు. చంద్రబాబు నిత్యం విదేశాలు తిరగుతుండటం - ఎక్కడికెళితే.. అక్కడిలా ఏపీని చేస్తాను అని చెబుతుంటారని, ఆ విషయంలో ఏపీ ప్రజలు ఉన్నంతలో అదృష్టవంతులే అని చెవిరెడ్డి అన్నారు. ఎందుకంటే.. ఆయన ఇప్పటివరకూ పాకిస్థాన్ వెళ్లలేదు కాబట్టి అని చెవిరెడ్డి చమత్కరించారు.

చంద్రబాబుకి రాష్ట్ర ప్రజల వాస్తవ పరిస్థితి ఏమాత్రం అర్థం కావడం లేదని చెప్పిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఎంతసేపూ సింగపూర్ - జపాన్ - మలేషియా దేశాలకు ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చిన అనంతరం - ఏపీని ఆయా దేశాల్లా మార్చేస్తానని చెబుతుంటారని - ప్రాక్టికల్ గా అదెలా సాధ్యమని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ఉన్నంతలో ఏఫీ ప్రజలు అదృష్టవంతులనీ... అందుకే చంద్రబాబు పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థాన్ - సోమాలియా వంటి దేశాల్లో పర్యటించలేదని.. ఒకవేళ ఆ దేశాల్లో పర్యటించి ఉంటే అప్పుడు కూడా ఏపీని ఆ దేశాల్లా మార్చేస్తానని చెప్పేవారని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో నిత్యం ఏపీని సింగపూర్ లా మార్చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడంపై కుడా చెవిరెడ్డి స్పందించారు. చాలా మంది ఏపీని సింగపూర్ లా మార్చేస్తానని బాబు చెబుతుంటే అదేదో అభివృద్ధిలో అనుకుంటారు కానీ... సింగపూర్ లో గత 40ఏళ్లుగా ప్రతిపక్షం అనేది లేదని - బాబు చెబుతున్న మాటలో అర్ధం అదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతిపక్షాలు లేకుండా నియంతృత్వంగా సాగడం సాధ్యంకాదని చంద్రబాబు గుర్తించాలని చెవిరెడ్డి సూచించారు.
Tags:    

Similar News