శంకర్ దాదా ఎంబీబీఎస్ సీన్ చూపించిన చెవిరెడ్డి

Update: 2021-05-23 05:30 GMT
వణికిస్తున్న కరోనా నేపథ్యంలో.. ప్రజల కోసమే తమ బతుకులు అన్నట్లుగా వ్యవహరించే నేతలు కనిపించకుండా పోవటం తెలిసిందే. ఎవరో కొందరు తప్పించి.. మిగిలిన వారంతా బతికి ఉంటే బలుసాకు తినొచ్చన్న చందంగా బయటకు రాకుండా హోం ఐసోలేషన్ లోనో.. లేదంటే ఫాంహౌస్ లకు పరిమితమవుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. మిగిలిన వారికి భిన్నంగా అనూహ్యమైన పని చేశారు ఏపీ ప్రభుత్వ విప్ కమ్ చంద్రగారి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

కరోనాతో బాధ పడుతున్న వారికి సరైన సాంత్వన.. ధైర్య వచనాలు టానిక్ లా పని చేస్తాయి. వారిలో పెరిగే స్థైర్యం.. వారిని ఆ రోగం నుంచి ఇట్టే బయటపడేలా చేస్తుంది. ఈ విషయం తనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదన్నట్లుగా వ్యవహరించారు చెవిరెడ్డి. కరోనా బాధితుల కోసం పడకల్ని ఏర్పాటు చేసి.. కిట్లను పంపిణీ చేస్తూ మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా అనూహ్యంగా వ్యవహరించారు.

తన నియోజకవర్గంలోని కోవిడ్ కేర్ సెంటర్కు వెళ్లారు. అక్కడ బాధితుల్ని పరామర్శించటమేకాదు.. మధ్యాహ్నం వరకు అక్కడే గడపటం గమనార్హం. సాధారణంగా ప్రముఖులు ఎవరైనా వెళితే.. అరగంటో.. గంటో ఉండటం.. ఆ వెంటనే జాగ్రత్తలు చెప్పేసి బయటకు రావటం తెలిసిందే. అందుకు భిన్నంగా గంటల తరబడి కొవిడ్ వార్డులో.. కొవిడ్ పేషెంట్లతో గడిపిన చెవిరెడ్డి.. రోగులతో క్యారమ్స్ ఆడటం గమనార్హం.

కరోనా గురించి భయపడొద్దని.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. చెవిరెడ్డి క్యారమ్స్ ఆడిన తీరుచూస్తే.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో రోగితో డాక్టర్ గా వ్యవహరించే హీరో క్యారమ్ష్ ఆడటం.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సదరు వ్యక్తిని రోగం బాధ నుంచి బయటకు పడేయటం.. స్వస్థత చేకూరేలా చేయటం తెలిసిందే. కరోనా కారణంగా ఒంటరిగా.. వేదన చెందే వారికి ఊరట కలిగించేలా.. వారితో మాట్లాడటమే కాదు.. క్యారమ్స్ ఆడిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. ఇలాంటి పనే ఏపీ సీఎం జగన్ చేస్తే మరింత ఎఫెక్టివ్ గా ఉండటమే కాదు.. బాధితుల్లో కొండంత ధైర్యాన్ని నింపుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News