ఛోటాను తీసుకొచ్చేశారు

Update: 2015-11-06 04:54 GMT
మాఫియా డాన్ ఛోటా రాజన్ భారత్ కు వచ్చేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వివిధ నేరాల్లో నిందితుడైన అతగాడు భారత్ నుంచి పారిపోయాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో ఒకడైన ఛోటాను పట్టుకునేందుకు భారత్ భద్రతా దళాలు విపరీతంగా ప్రయత్నించాయి. అయితే.. అతను దొరకలేదు. అండర్ వరల్డ్ డాన్ గా వెలుగొందుతున్న దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడి వ్యవహరించిన అతగాడు.. ఆ తర్వాత దావూద్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శత్రువుగా మారాడు. అప్పటి నుంచి ఈ రెండు గ్యాంగ్ ల మధ్య పోరు సాగుతోంది.

ఇదిలా ఉంటే హత్య.. స్మగ్లింగ్.. బలవంతపు వసూళ్లు తదితర నేరాలతో ఆరోపణలు ఉన్న ఛోటాను తాజాగా ఇండోనేషియా బాలిలో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. దీంతో.. అతడ్ని విచారించేందుకు భారత్ కు ప్రత్యేక విమానంలోతీసుకొచ్చారు. బాలి నుంచి గురువారం రాత్రి 7.45 గంటలకు బయలుదేరిన వీరి విమానం.. శుక్రవారం ఉదయం 5.50 గంటలకు ముంబయిలోని పాలం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఛోటా రాజన్ మీద ఉన్న దాదాపు 75 కేసుల్లో అత్యధికం ముంబయిలోనే నమోదై ఉన్నాయి. ఇక.. ఢిల్లీలో పది కేసులు నమోదు అయినట్లుగా తేల్చారు. మరోవైపు.. ఛోటా మీద ఉన్న కేసులన్నింటిని సీబీఐకి అప్పగిస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. ఛోటా మీద ఎలాంటి విచారణ జరగనుంది? అతగాడి నేరాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చగా మారింది. మరోవైపు.. శక్తివంతమైన అండర్ వరల్డ్ డాన్ లలో ఒకరైన ఛోటాను ముంబయికి తీసుకురావటంతో.. అక్కడి వాతావరణం హాట్.. హాట్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. ఛోటాను భద్రత కల్పించే అధికారులకు ఇక.. చుక్కలు కనిపిస్తాయేమో.
Tags:    

Similar News