కసబ్ ను ఉంచిన చోటే ఛోటా రాజన్ నూ

Update: 2015-10-28 10:13 GMT
అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ను 26/11 నాటి ముంబై దాడుల్లో ప్రాణాలతో పట్టుబడ్డ అజ్మల్‌ కసబ్‌ ను ఉంచిన జైలు గదిలో ఉంచడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ముంబయిలోని ఆర్థర్‌ రోడ్డులోని జైలును నలుగురితో కూడిన సిబిఐ - రాష్ట్ర హోంశాఖ - ముంబై పోలీసు అధికారుల బృందం బుధవారం సందర్శించింది. రాజన్‌ ను అక్కడ ఉంచడానికిగల అవకాశాలను, భద్రతా ఏర్పాట్లను వారు జైలు అధికారులతో సమీక్షించారు. కసబ్‌ ను ఉరి తీయడానికి ముందు ఈ జైలు గదిలోనే సుమారు నాలుగేళ్లపాటు ఉన్నాడు.

మరోవైపు భారత్‌ లో తనను హత్య చేసే అవకాశాలున్నాయని, జింబాబ్వే వెళ్లడానికి తనకు అనుమతినివ్వాలని ఛోటా రాజన్‌ కోరుతున్నాడు. ఛోటారాజన్‌ ను ఇండోనేషియాలోని బాలిలో అరెస్టు చేసిన తరువాత ఆయన్ను ఇండియాకు తీసుకొస్తారని... ఇక్కడైతే సేఫ్ అని ఆయన కూడా భావిస్తున్నాడని వార్తలొచ్చాయి. కానీ ఛోటా రాజన్ మాత్రం జింబాబ్వే వెళ్లడానికి అనుమతి కోరుతున్నాడు. బాలిలో తనను ప్రశ్నిస్తున్న పోలీసులను తాను జింబాబ్వే వెళ్లడానికి అనుమతించాల్సిందిగా పదేపదే కోరాడు.

దావూద్‌ ఇబ్రహీంకు కుడిభుజంగా ఉన్న ఛోటారాజన్‌ తదనంతర కాలంలో అతడికి బద్ధ శత్రువుగా మారాడు. దాంతో దావూద్ నమ్మిన బంటు ఛోటా షకీల్ అప్పటి నుంచి రాజన్ ను వెంటాడుతూనే ఉన్నాడు. నిత్యం హత్యా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో రాజన్ ఇప్పుడు చావుకు భయపడుతున్నాడు. తాజాగా రాజన్ అరెస్టయిన తరువాత కూడా షకీల్... చోటా రాజన్ ను తాను చంపక మాననని చెప్పాడు.
Tags:    

Similar News