సడెన్ గా ఒడిషాకు.. ఫోకస్ అక్కడేనా... ?

Update: 2021-11-07 03:30 GMT
ఒడిషాకు ముఖ్యమంత్రి జగన్ ఈ నెల తొమ్మిదిన వెళ్తున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో అధికార స్థాయిలో పలు కీలకమైన అంశాల మీద చర్చలు జరపనున్నారు. జగన్ సీఎం అయ్యాక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కావడం ఇది రెండవసారి. ఆయన ఇంతకు ముందు తెలంగాణా సీఎం కేసీయార్ తో కొన్ని సార్లు కలసి పలు అంశాల మీద చర్చించారు. ఇక ఏపీకి మరో పొరుగు రాష్ట్రంగా ఒడిషా ఉంది. ఒడిషాతో ఏపీ సరిహద్దు జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం ఉన్నాయి ఇక పోలవరం ఇష్యూ మీద వివాదం కూడా ఒడిషాతో ఏపీకి ఉంది. ఇలా జల వివాదాలతో పాటు అనేక సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా ఉన్నాయి. వాటిని పరిష్కరించువడానికి ఇప్పటిదాకా అధికారుల స్థాయిలోనే చర్చలు జరిగాయి తప్ప ముఖ్యమంత్రుల సమావేశం మాత్రం జరగలేదు.

ఇక చివరిసారిగా ఉమ్మడి ఏపీ నుంచి ఒడిషా సీఎం తో భేటీ అయినది నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఆయన 1994లో సీఎం అయ్యాక నాటి ఒడిషా సీఎం బిజూ పట్నాయక్ తో జల వివాదాల మీద చర్చించారు. ఆ తరువాత మళ్ళీ ఒడిషా వెళ్లి ఏ సీఎం చర్చలు జరిపింది లేదు. జగన్ విషయానికి వస్తే ఆయన ఉత్తరాంధ్రా జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నపుడు స్థానికంగా ఉన్న అనేక జల వివాదాల గురించి ప్రస్తావించారు. చంద్రబాబు ఒక రోజు తీరిక చేసుకుని ఒడిషాతో చర్చలు జరిపి ఎందుకు పరిష్కారం చూపించరూ అంటూ ప్రశ్నించారు కూడా. అయితే జగన్ సీఎం అయ్యాక కూడా రెండున్నరేళ్ల దాకా తీరిక దొరకలేదు అనుకోవాలేమో. మొత్తానికి ఇన్నాళ్లకు జగన్ ఒడిషా వెళ్తున్నారు.

అయితే జగన్ నవీన్ పట్నాయక్ తో మంచి సంబంధాలనే ఇప్పటిదాక నెరుపుతూ వచ్చారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు కూడా వివిధ అంశాల మీద జరిగాయి. ఇక ఇపుడు జగనే స్వయంగా ఒడిషా వెళ్తున్నారు. ఈ నెల తొమ్మిదిన ఆయన భువనేశ్వర్ చేరుకుని ఒడిషా సీఎం నవీన్ తో ఆయన అధికార నివాసంలో భేటీ అవుతారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నది మీద ఏపీ నిర్మించతలపెడుతున్న నేరెడి బ్యారేజి విషయం చర్చకు రావచ్చు. ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తి అయితే ఏపీకి ఒడిషాకు కూడా లాభకరమే. పైగా శ్రీకాకుళం జిల్లాకు వంద టీఎంసీల వంశధార నీరు లభిస్తుంది. వృధాగా సముద్రంలో కలసిపోతున్న ఈ నీటిని ఒడిసిపట్టుకుని సాగు, తాగు నీటికి ఉపయోగించుకోవచ్చు. ఈ విషయంలో ఒడిషాకు ఉన్న అభ్యంతరాలను అడిగి తెలుసుకుని జగన్ వాటిని సాల్వ్ చేస్తారు అంటున్నారు.

అదే విధంగా విజయన‌గరం జిల్లా సాలూరు నియోజకవర్గం సరిహద్దులోని కొటియా గ్రామాలు ఇరవై దాకా ఉన్నాయి. వారంతా ఏపీలోనే ఉంటామని అంటున్నారు. వారికి ఏపీ నుంచే సంక్షేమ పధకాలు అందుతున్నాయి. ఈ మధ్యనే ఆయా గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ముఖ్య నేతలు విజయనగరం కలెక్టర్ ని కలసి తమను ఏపీలో కొనసాగనివ్వాలని కోరారు. ఇక వారిని తమ వైపే ఉంచాలని ఒడిషా సర్కార్ చేస్తున్న ప్రయత్నాలతో సరిహద్దుల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయి. సాలూరు ఎమ్మెల్యేను సైతం అక్కడి పోలీసులు, అధికారులు కొటియా గ్రామాల వైపు రాకుండా తరచూ అడ్డుకుంటున్నారు. దాంతో ఈ ఇష్యూ మీద కూడా జగన్ నవీన్ తో చర్చించి పరిష్కారం కనుగొంటారు అంటున్నారు.

ఇక అన్నింటి కంటే మరో ముఖ్య విషయం పోలవరం ప్రాజెక్ట్. ఈ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ పూర్తి అయితే తమ వైపు ఉన్న గ్రామాలు కొన్ని మునిగిపోతాయని ఒడిషా అభ్యంతరం పెడుతోంది. కోర్టుకు వెళ్ళి మరీ అడ్డంకులు సృష్టిస్తోంది. దాంతో దీని మీద కూడా నవీన్ తో చర్చించి జగన్ పోలవరానికి అవరోధాలు లేకుండా చూస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ ఒడిషా సందర్శన ద్వారా పాలనాపరంగా రాజకీయంగా కూడా ప్రయోజనాలు ఆశిస్తున్నారు అంటున్నారు. పోలవరం వల్ల గోదావరి జిల్లాలకు మేలు చేకూరుతుంది. అలాగే ఉత్తరాంధ్రాలోని వంశధార ప్రాజెక్టుల ద్వారా ఆ ప్రాంతానికి భారీ ప్రయోజనం దక్కుతుంది. దాంతో అయిదు జిల్లాల్లో రాజకీయాన్ని తన వైపు అనుకూలంగా తిప్పుకోవడానికి సడెన్ గా జగన్ ఒడిషా టూర్ వేస్తున్నారు అంటున్నారు. మొత్తానికి రాజకీయాలు ఎలా ఉన్నా కూడా దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు జగన్ కనుక పరిష్కరిస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది అంటున్నారు మేధావులు. చూడాలి మరి నవీన్ ఎలా రియాక్ట్ అవుతారో.




Tags:    

Similar News