చైనాలో తగ్గుతున్న జనాభా.. రాబోయే 100 ఏళ్లు గడ్డుకాలమే

Update: 2022-06-08 14:30 GMT
జనాభా పెరిగినా.. తగ్గినా సమస్యే. చైనాని చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. మొన్నటి వరకు అత్యధిక జనాభాతో ఎంత ఉత్పాదకత ఉన్నా ఉత్పత్తులు సరి పోక ఇబ్బందులు పడింది. ఇప్పుడేమో జనాభా తగ్గిపోయి.. పనిచేసే వయసున్న వారి సంఖ్య క్షీణించి ఉత్పాదకత తగ్గి అవస్థలు పడుతోంది. చైనా జనాభా ఊహించిన దాని కంటే వేగంగా తగ్గడం వల్ల పనిచేసే వయసున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. యువత తగ్గిపోవడంతో అక్కడ ఉత్పాదక శక్తి వేగంగా పడిపోతోంది. క్రమంగా దేశ అవసరాలకు తగినంత కార్మిక శక్తి లేక కొత్త సవాళ్లు ఎదుర్కొంటోంది.

అమెరికా స్థానాన్ని భర్తీ చేసి.. ప్రపంచానికి పెద్దన్న గా మారాలనుకుంటున్న చైనా కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అనే ట్యాగ్‌లైన్‌ను చైనా త్వరలో కోల్పోనున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనాకు ఇప్పటి వరకు ఉన్న బలమే బలహీనతగా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.  చైనాలో రోజురోజుకు తగ్గిపోతున్న జనాభా ఆ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. 40 ఏళ్లలో ఆ దేశ జనాభా తొలిసారిగా తగ్గబోతోంది. ఇది దేనికి సంకేతం?

ఏదైనా త్వరగా నిర్మించడంలో.. ఏ సమస్యనైనా త్వరగా పరిష్కరించడంలో.. వేగంగా ఉత్పత్తి చేయడంలో చైనాకు పోటీ ఏ దేశం రాదు. ఉత్పాదన సామర్థ్యంలో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న చైనా.. రాబోయే రోజుల్లో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దేశంలో జనాభా భారీ సంఖ్యలో తగ్గడం ఆ దేశ ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. జనాభా తగ్గిపవడం వల్ల యువత సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఫలితంగా పనిచేసే వారు లేక చైనా ఉత్పాదకత తగ్గిపోతోంది.

ప్రస్తుతం చైనాలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. చైనా జనాభా 2029లో గరిష్ట స్థాయిలో 144 కోట్లకు పెరిగిపోతుందని చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ 2019లో అంచనా వేసింది. ఆ తర్వాత 2031-32 సంవత్సరాల నాటికి కూడా ఈ పెరుగుదల కొనసాగుతుందని అప్పటికి గరిష్ట స్థాయిలో 146 కోట్లకు జనాభా సంఖ్య పెరుగుతుందని 2019 నాటి ఐక్యరాజ్యసమితి జనాభా అంచనాల నివేదిక లెక్కగట్టింది. కానీ అంచనాలకు భిన్నంగా గతేడాది నుంచి చైనా జనాభా వేగంగా తగ్గుతూ వస్తోంది. 2021 నుంచి దేశ జనాభా ఏటా 1.1 శాతం చొప్పున తగ్గుతూ వస్తుందని.. 2100 సంవత్సరం నాటికి జనాభా ఇప్పటికన్నా సగానికి పైగా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.

చైనా జనం పిల్లలను కనేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఇప్పటికే జనాభా తగ్గుముఖం పట్టింది. జనాభా నియంత్రణ కోసం గతంలో ప్రవేశపెట్టిన ఒకే బిడ్డ విధానాన్ని చైనా 2016లో సడలించింది. ఇద్దరు బిడ్డలను కనేందుకు ప్రజలను అనుమతించింది. అనంతరం 2021లో ముగ్గురు బిడ్డల విధానాన్ని ప్రవేశపెట్టి, పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. అయినా ఆ దేశంలో జననాల రేటు క్రమంగా పడిపోతోంది. చైనా మహిళలు పిల్లలను కనడానికి ఎందుకు ఇష్టపడటం లేదనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.  జనాభా తగ్గుదల ఇలాగే కొనసాగితే 2030 నాటికి చైనా జననాల రేటు 1.15 నుంచి 1.1 శాతానికి పడిపోతుందని.. అది 2100 సంవత్సరం వరకూ అలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

చైనాలో 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వయోవృద్ధుల జనాభా పెరుగుతూ వస్తోంది. 2080 నాటికి వృద్ధుల సంఖ్య.. పనిచేసే వయసు వారి సంఖ్యను మించిపోతుందని.. ఆ తర్వాత కూడా వృద్ధుల జనాభా పెరుగుదల కొనసాగుతుందని అంచనాలు వేశారు. ఈ మార్పు చైనా ఉత్పాదక సామర్ద్యంపై ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గిపోయి కూర్చొని తినేవాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారనుందని అంచనా వేస్తున్నారు.

కార్మిక శక్తి వేగంగా పడిపోతుండటం వల్ల కార్మిక శక్తి ఖరీదు పెరిగిపోతుంది. ఫలితంగా తక్కువ లాభాలుండే, కార్మిక శక్తి ఎక్కువ అవసరమయ్యే తయారీ రంగం చైనా నుంచి బయటకు తరలిపోతుంది. కార్మిక శక్తి పుష్కలంగా లభించే వియత్నాం, బంగ్లాదేశ్, ఇండియా వంటి దేశాలకు ఆ తయారీ రంగం మళ్లుతుంది. ఇప్పటికే.. వియత్నాంతో పోలిస్తే చైనాలో తయారీ రంగపు కార్మిక శక్తి ఖరీదు రెట్టింపుగా ఉంది. అదే సమయంలో.. పెరుగుతున్న వృద్ధ జనాభా అవసరాలను తీర్చటానికి చైనా తన ఉత్పాదక వనరుల్లో ఎక్కువ భాగాన్ని ఆరోగ్యం, వైద్య రంగాలకు మళ్లించాల్సి వస్తుంది. చైనాలో ఇప్పుడున్న పెన్షన్ విధానంలో మార్పులు చేయకపోతే.. 2020 సంవత్సరంలో జీడీపీలో 4 శాతంగా ఉన్న ఆ దేశ పెన్షన్ చెల్లింపులు 2100 సంవత్సరానికి జీడీపీలో 20 శాతానికి పెరిగిపోతుందని.. ఆస్ట్రేలియాలోని విక్టోరియా యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఆఫ్ పాలసీ స్టడీస్ రూపొందించిన ఒక నమూనా హెచ్చరిస్తోంది.

ప్రపంచాన్ని ఏలుదామనుకుంటున్న చైనాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల నుంచి చైనాను తప్పించడం ఏ దేశ తరంకాదు. చైనా తన ఉత్పాదకత సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే ఆధునికీకరణ వైపు మళ్లాలి. అలా చేస్తే ఉత్పాదక ఖర్చు పెరిగి వస్తువుల ధరలు పెరుగుతాయి. ఖరీదైన వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ తగ్గిపోతుంది అప్పుడు ఆర్థికాభివృద్ధి మరింతగా తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలా చూసుకున్నా రాబోయే వందేళ్లు చైనాకు అత్యంత గడ్డు కాలమనే చెప్పుకోవాలి.
Tags:    

Similar News