ప్రచారం హోరెత్తిస్తున్నా..చైనా అమ్మకాల జోరు మాత్రం తగ్గలేదట!

Update: 2020-06-19 04:45 GMT
గాల్వన్ లోయలో భారత సైనికుల్ని హతమార్చిన డ్రాగన్ తీరు పై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు.. నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చైనా వస్తువుల్ని అమ్మరాదని మాత్రమే కాదు కొనొద్దన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా.. భారతీయ రైల్వే సైతం చైనాతో కాంటాక్టును రద్దు చేసుకుంది. వివిధ వర్గాల నుంచి చైనాకు షాకివ్వాలంటే.. వారి ఉత్పత్తుల్ని కొనుగోలు చేయకుండా ఉంటే సరిపోతుందన్న డిమాండ్ మాత్రమే కాదు.. చైనా ఉత్పత్తులకు సెలబ్రిటీలు ప్రచారం చేయొద్దన్న వినతులు వెల్లువెత్తుతున్నాయి.

చైనా వస్తువుల బహిష్కరణపై దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామని.. ప్రజలకు అవగాహన కల్పిస్తామని వీహెచ్ పీ పేర్కొంది. జవాన్ల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన చైనాకు దేశ ప్రజలు జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వీహెచ్ పీ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. ఇలా అన్ని వర్గాల నుంచి చైనా పై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.

దీనికి తగ్గట్లే.. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ సుంకాలు పెంచే అంశంపైనా ఆలోచిస్తున్నట్లుగా కేంద్రం వెల్లడించింది. భారత్ లో చైనా ఆహారాన్ని విక్రయించే అన్ని హోటళ్లు.. రెస్టారెంట్లను మూసివేయాలని.. చైనా వస్తువుల్ని బహిష్కరించాలని కేంద్రమంత్రి రాందాస్ అఠవలే పిలుపునిచ్చారు. ఆయన మాత్రమే కాదు మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సైతం మాట్లాడుతూ.. భారత్ ఇకపై చైనా మీద ఆధారపడరాదన్నారు. ఇలాంటి సందేశాల జోరు గురువారం భారీగా సాగింది.

కొసమెరుపు ఏమంటే.. ఇంతటి భావోద్వేగం దేశ వ్యాప్తంగా సాగుతున్నా.. చైనా వస్తువుల అమ్మకాల మీద మాత్రం ప్రభావం పడలేదన్న విషయాన్ని చైనా సంస్థల్లో పని చేసే సీనియర్ ఎగ్జిక్యుటివ్ లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారని.. విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా తరగతులు వింటున్నారని.. తమ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉందని ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ సీనియర్ ఉద్యోగి వెల్లడించినట్లుగా ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఎమోషనల్ గా ఎంతున్నా.. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉంటే.. చైనా మీద ఒత్తిడి మాటల్లో మాత్రమే ఉంటుందన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News