చైనా పెట్రోలు వస్తోందోచ్..

Update: 2016-06-12 09:40 GMT
చైనా ఉత్పత్తులంటేనే అత్యంత చౌక వస్తువులని మారు పేరు. అదే సమయంలో చాలాచోట్ల చిన్నచూపు కూడా ఉంది. మరోవైపు చైనా ఉత్పత్తుల పోటీని తట్టుకోలేక ఎన్నో ప్రపంచ దేశాలు కిందామీదా పడుతున్నాయి. ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మార్కెట్లు 80 శాతం చైనా ఉత్పత్తులతోనే నిండిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా ఉత్పత్తులు లభించని దేశం లేదంటే అతిశయోక్తికాదు. బ్రాండెడ్‌ కంపెనీల ప్రాడక్టులు అచ్చుగుద్ది మార్కెట్లో విడుదల చేయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. అదీ ఇదీ అని లేకుండా అన్ని రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తూ చైనా ప్రపంచ మార్కెట్ ను ఇప్పటికే కమ్మేసింది. ఇప్పుడు చైనా ఇంకో రంగంపై దృష్టి పెట్టడంతో చాలా ప్రపంచ దేశాలు గడగడ లాడుతున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్రోల్‌ బంక్‌ లలో చైనా పెట్రోల్‌ విక్రయించాలని ఆ దేశం టార్గెట్ గా పెట్టుకుంది.  ఇప్పటికే చైనా పెద్ద ఎత్తున ముడిచమురును శుద్ది చేసి విదేశాలకు సరఫరా చేస్తోంది. దీంతో పెట్రోలు రిటైల్ సేల్స్ లోకి చైనా అడుగుపెడితే తమ పని అంతేనని చమురు ఉత్పాదక దేశాలు వణుకుతున్నాయి.

చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో అక్కడి ప్రైవేట్‌ కంపెనీలు ముడిచమురును శుద్ది చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికా ముడి చమురు ధరలు పుంజుకోవడం - సరకు రవాణా చార్జీలు తగ్గుముఖం పట్టడంతో చైనా కంపెనీలు విదేశాలకు ఇంధనం ఎగుమతి చేసి లాభాలను గడిస్తున్నాయి. లాటిన్‌ అమెరికాలో రీఫైనింగ్‌  ప్రాజెక్టుల్లో జాప్యం జరగడంతో అక్కడ డిమాండ్‌ పెరిగడం, సరకు రవాణాచార్జీలు తగ్గడం చైనాకు బాగా కలిసొచ్చింది.  దీంతో యూరోప్‌, అమెరికా కంపెనీల లాభాలకు గండిపడే అవకాశం ఉంది. ఇక చైనా విషయానికొస్తే  ఇంధనం ఎగుమతి చేసే దేశంగా అది ఫుల్ స్వింగులో ఉంది.  ఇటీవల కాలంలో చైనా పెద్దెత్తున చమురుశుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసింది. దేశీయ డిమాండ్‌ పోను విదేశాలకు ఎగమతి చేసే స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతంచైనా రోజు 14.5 మిలియన్‌ల పీపాల ముడిచమురును శుద్ధి చేస్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని బ్లూమ్‌బర్గ్‌ అధ్యయనంలో తేలింది.

కాగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో చైనా వద్ద అదనంగా 7 లక్షల పీపాల ఇంధనం మిగిలిపోతుంది. ఈ ఏడాది చైనా నుంచి పెట్రోల్‌ - డిజెల్‌ ఎగుమతుల్లో 30 శాతం పెరగనుంది.  చైనాలో రీఫైనింగ్‌ సామర్థ్యం పెరరగడంతో  అమెరికా - యూరోప్‌ రీఫైనరీలకు చైనా గట్టిపోటీ ఇస్తుంది.  చైనా నుంచి అమెరికాకు 300,000 పీపాల పెట్రోల్‌ గల్ప్‌కోస్ట్‌ ద్వారా తరలిస్తే పీపాకు నాలుగు డాలర్లు వ్యయం అవుతుంది. దీంతో పోల్చుకుంటే అమెరికాలో ఇంధనం ధర పీపా సరాసరి 13 డాలర్లు ఎక్కువగా ఉంటోంది.  అంటే చైనా నుంచి వచ్చే ఇంధనమే చౌకగా ఉందన్నమాట.  మరోవైపు విదేశీ మార్గెట్లను టార్గెట్ చేయడంతో చైనా నాణ్యమైన పెట్రోలునే తయారుచేస్తోందట.  సో... కొద్దికాలంలోనే ప్రపంచమంతా చైనా పెట్రోలుతో నడవబోతుందన్నమాట.
Tags:    

Similar News