టీవీల్లో వార్తలు చదివే రోబోలు వచ్చేశాయి

Update: 2015-12-25 05:03 GMT
మనిషికి ముప్పు ఎక్కడో లేదు.. మనిషి మేధోతనమేనన్న భావన ఈ ఉదంతాన్ని చూస్తే అర్థం కాక మానదు. పరిణామక్రమంలో.. తన అవసరాలకు తయారు చేసుకుంటున్న ‘యంత్రుడు’ భవిష్యత్తులో మనిషి స్థానాన్ని ఆక్రమించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నమొన్నటివరకూ సేవలు చేసేందుకు వీలుగా రోబోలు తయారు చేస్తే.. ఇప్పుడు మనిషికి ప్రత్యామ్నాయంగా వివిధ సేవలకు ఈ ‘‘యంత్రుడ్ని’’ వినియోగించే ధోరణి పెరుగుతోంది.

ఇంట్లోనూ.. ఆఫీసుల్లో పనులు చేసి పెట్టే రోబోలు నుంచి పెద్ద పెద్ద మాల్స్ లో మనిషిని పోలినట్లుగా ఉండే రోబోలు రంగప్రవేశం చేయటం తెలిసిందే. రెసెప్షనిస్ట్ గా.. సేల్స్ మెన్ గా ఇలా ఎన్నో రకాలుగా తయారుచేస్తున్న రోబోల స్థానే.. తాజాగా చైనాకు చెందిన ఒక టీవీ ఛానల్ రోబోతో వాతావరణ వార్తలు చదివించటం సంచలనంగా మారింది.

చైనాకు చెందిన షాంఘై డ్రాగన్ టీవీ.. ‘‘షియావో ఐస్’’గా పిలిచే రోబోతో వాతావరణ వార్తల్ని విజయవంతంగా చదివించటం హాట్ టాపిక్ గా మారింది. శీతాకాల వాతావరణంపై వార్తలతో నా విధుల్ని ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందంటూ తియ్యతియ్యటి వాయిస్ తో ఈ రోబో న్యూస్ రీడర్  చైనా ప్రేక్షకుల్ని కట్టి పడేసినట్లుగా చెబుతున్నారు. స్మార్ట్ క్లౌడ్.. బిగ్ డేటా టెక్నాలజీతో మైక్రోసాఫ్ట్ ఈ రోబోను రూపొందించినట్లుగా చెబుతున్నారు. భవిష్యత్తులో రోబో లైఫ్ పార్ట్ నర్స్ రావటం ఖాయమన్న అంచనాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. మనిషికి.. సాటి మనిషితో సంబంధం లేకుండా చేయటంలో యంత్రుడు సక్సెస్ అవుతాడేమో. దీనికి మనిషే కారణం కావటం అన్నింటికి మించిన పెద్ద విషాదమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News