చైనా కంపెనీ వివో మ‌న‌దేశంలో అంత కుట్ర‌కు పాల్ప‌డిందా?

Update: 2022-07-26 15:30 GMT
చైనా మొబైల్‌ తయారీ కంపెనీ వివో మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అస్థిర‌ప‌రిచే కుట్ర‌కు పాల్ప‌డిందా అంటే అవున‌నే అంటోంది.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ). అందుకే వివో బ్యాంకు ఖాతాల‌ను స్తంభింప చేశామ‌ని ఈడీ చెబుతోంది. తాము సీజ్‌ చేసిన ఆ ఖాతాలు మనీలాండరింగ్‌లో భాగంగా ఉన్నాయని పేర్కొంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే కుట్రగా పేర్కొంది.

త‌మ కంపెనీ ఖాతాలు సీజ్‌ చేయడంపై వివో ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో జూలై 26న‌ విచార‌ణ జ‌రిగింది. దీంతో ఈడీ ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసింది. మనీలాండరింగ్‌ ద్వారా అతిపెద్ద ఆర్థిక నేరానికి వివో పాల్పడిందని ఈడీ త‌న అఫిడ‌విట్ లో వివ‌రించింది.

చైనాలోనే కాకుండా ప్ర‌పంచంలోనే అతిపెద్ద మొబైల్ కంపెనీల్లో ఒక‌టిగా ఉన్న వివో, దాని అనుబంధ సంస్థ‌ల్లో జూలై 5న దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు నిర్వహించింది. వివో టర్నోవర్‌లో సగానికి పైగా నిధులను (రూ.62,476 కోట్లు) ఆ కంపెనీ చైనాకు తరలించిందని ఈడీ ఆరోపిస్తోంది.

ఈ మనీలాండరింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలపైనే ఆ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామ‌ని చెబుతోంది. దీనిపై వివో ఇండియా ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిచింది. దీనిపై స్పందించిన కోర్టు.. రూ.950 కోట్ల బ్యాంక్‌ గ్యారెంటీలను సమర్పించి ఈడీ సీజ్‌ చేసిన ఖాతాలను వినియోగించుకోవచ్చని సూచించింది. వివో పిటిషన్‌పై ఈడీ స్పందనను కోర్టు కోరగా.. తాజాగా ఈడీ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాతాలనే తాము స్తంభింపజేసినట్లు ఈడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. స‌క్రమంగా ఉన్న మిగిలిన ఖాతాల జోలికి వెళ్ల‌డం లేద‌ని ఈడీ వివ‌రించింది. వివో కంపెనీ చేసింది కేవలం ఆర్థిక నేరం కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే కుట్రగా ఈడీ అభివర్ణించింది. దీనివల్ల భార‌త‌దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ప్రమాదం పొంచి ఉందని అఫిడవిట్‌లో తెలిపింది.

వివో కంపెనీలు, అనుబంధ కంపెనీల్లో సోదాలు నిర్వహించడానికి, ఖాతాలను జప్తు చేయడానికి ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఈడీ తేల్చిచెప్పింది. ఈ విషయంలో తాము చట్ట ప్రకారమే వ్యవహరించినట్లు ఢిల్లీ హైకోర్టుకు నివేదించింది. మ‌నీలాండ‌రింగ్ వ్య‌వ‌హారంలో వివో ఇండియా, దాని 22 అనుబంధ సంస్థల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు ఈడీ తెలిపింది. ముఖ్యంగా మెజారిటీ నిధులు చైనాకు తరలిపోవడం అనుమానాస్పందంగా ఉందని కోర్టు దృష్టికి తెచ్చింది. దానిపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. దీంతో వ్యవహారంపై తదుపరి విచారణను జూలై 28కి కోర్టు వాయిదా వేసింది.
Tags:    

Similar News