క్ష‌మించాలి.. లైంగిక వేధింపుల్ని చిత్రించ‌లేను!-చిన్మ‌యి

Update: 2022-02-26 03:25 GMT
2018లో మీటూ సంచ‌ల‌నాల గురించి తెలిసిన‌దే. #MeToo వేదిక‌గా సోష‌ల్ మీడియాల్లో వేధింపుల‌కు గురైన ఎంద‌రో సెల‌బ్రిటీలు ఓపెన‌య్యారు. ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు సైతం ఈ వేదిక‌పై త‌మ‌కు జ‌రిగిన వేధింపుల ప్ర‌హ‌స‌నంపై గొంతెత్తారు.

అయితే ఈ ఉద్య‌మానికి ఊపు రావ‌డానికి కార‌ణం మాత్రం ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద. మీటూ వేదిక‌గా త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని వేధింపుల ఘ‌ట్టాన్ని ఓపెన్ గా చెప్పారు చిన్మ‌యి. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో #MeToo కోసం చిన్మ‌యి నిలబడిన తీరుకు చాలా ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఇక చిన్మ‌యి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. గాయ‌నిగా డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో సీనియ‌ర్. అగ్ర నాయిక సమంత న‌టించిన అన్ని సినిమాల‌కు చిన్మ‌యి గాత్రదానం చేసారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ గీత రచయిత పై వేధింపుల‌ ఆరోపణలతో చిన్మ‌యి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. ఆ తర్వాత ఆమె తమిళ చిత్రాలకు డబ్బింగ్ చేయడానికి లైసెన్స్ కోల్పోయింది. తెలుగులోనూ ఆఫ‌ర్లు అంతంత మాత్ర‌మే. ఇక అక్కినేని కాంపౌండ్ సినిమాల్లో చిన్మ‌యి- రాహుల్ జంట అవ‌కాశాలు అందుకుంటున్న సంగ‌తి తెలిసిన‌దే.

అయితే ఇటీవ‌ల ఓ ఈవెంట్ చిన్మ‌యిలో కోపాగ్నికి కార‌ణ‌మైంది. త‌న‌ను వేధించిన స‌ద‌రు ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత గొప్ప గొప్ప వాళ్ల‌తో ఒకే వేదిక‌ను పంచుకోవ‌డం కోపాగ్నికి ఆజ్యం పోసింది. ఈ ప్రత్యేక గీత రచయిత తమిళనాడు సీఎం.. రాహుల్ గాంధీ - రజనీకాంత్ వంటి పెద్ద స్టార్ లతో సహా పలువురు ప్రముఖులతో వేదికను పంచుకున్నారు. ఈ రోజు చిన్మయి తన వరుస ట్వీట్లలో ఇలాంటి లైంగిక వేటగాళ్ళు ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే మహిళలు ఎలా సురక్షితంగా  ఉన్నార‌ని ఎలా భావిస్తారని ప్రశ్నించారు.

స్త్రీగా ఉండి మీ వేధింపులకు పేరు పెట్టడం ఎందుకు కష్టమో తెలుసా? ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో గౌరవనీయులైన TN ముఖ్యమంత్రి... గౌరవనీయులైన కేరళ ముఖ్యమంత్రి... శ్రీ రాహుల్ గాంధీ... గౌరవప్రదమైన MP కనిమొళితో కలిసి అత‌డు వేదికను పంచుకున్నారు.  మిస్టర్ కమల్ హాసన్ ... మిస్టర్ రజనీకాంత్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు`` అని ఆమె తన ట్విట్టర్ పేజీలో రాసింది.

దేశంలోని రాజకీయ నాయకులు... స్త్రీలపై పురుషులు వేధింపులకు పాల్పడితే పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొంది. ఇప్పటికే 20 మంది మహిళలు త‌మ వేధింపుల గురించి త‌న‌కు తెలిపార‌ని వెల్ల‌డించారు. అయితే తాను అలా అన‌గానే.. ట్విట్టర్ లో ఒక వ్యక్తి వాటికి రుజువు కావాల‌ని అడిగాడు. దానికి చిన్మ‌యి వెంట‌నే ఇలా సమాధానమిచ్చింది, ``క్షమించండి అందరూ అడుగుతున్న లైంగిక వేధింపుల వీడియోను నేను చిత్రీకరించలేకపోయాను`` అని వ్యంగ్యంగా స్పందించింది.  చిన్మయి చేసిన ఆరోపణలపై ఏ ప్రభుత్వమైనా స్పందిస్తుందా? అన్న‌ది చూడాలి. వేధింపులు అనేవి అమ్మాయిలు అబ్బాయిలు ఎవ‌రికైనా త‌ప్ప‌వు కాబ‌ట్టి ఇలాంటి సంద‌ర్భాల్లో ర‌క్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని కూడా చిన్మ‌యి అన్నారు.
Tags:    

Similar News