చింతా మోహన్ ఆశలు : ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి...?

Update: 2022-08-13 09:02 GMT
ఆయన కేంద్ర మాజీ మంత్రి. కాంగ్రెస్ కి కట్టుబడిపోయిన సీనియర్ నేత. ఉంటే కాంగ్రెస్ లేకుంటే లేదు అన్నట్లుగా ఉండే కొద్ది మంది కరడుకట్టిన నేతలలో ఆయన ఒకరు. ఆయనే చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్. ఆయన తిరుపతిలో ఈ రోజు కీలకమైన కామెంట్స్ చేశారు. తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర సందర్భంగా చింతా మోహన్ కాంగ్రెస్ దే  వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం అని ఢంకా భజాయించారు. అంతే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని కూడా జోస్యం వదిలారు.

చింతా మోహన్ ఆశ బాగానే ఉంది కానీ ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సీన్ ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఏపీలో మెల్లగా తమిళనాడు రాజకీయం మొదలైంది. ఇక్కడ రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలుగా వైసీపీ, టీడీపీ ఉంటే ఇపుడు మూడవ ప్రాంతీయ పార్టీగా జనసేన కూడా వస్తోంది. జాతీయ పార్టీలకు తమిళనాడులో ఎలా చోటు లేదో ఏపీలో కూడా అంతే అన్న సీన్ ఉంది. ఇక ఏపీలో   విభజన తరువాత గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణమైన ఫలితాలు సాధించింది. ఓట్ల షేర్ లో నోటాతో పోటీ పడింది.

ఇక ఏ ఉప ఎన్నిక జరిగినా డిపాజిట్లు పోవడం కాంగ్రెస్ కి కామన్ అయింది. ఏపీలో బలమైన నాయుకులు అంతా వైసీపీ, టీడీపీలలో సర్దుకున్నారు. ఇక చింతా మోహన్ లాంటి మిగిలిన నాయకులు మాత్రమే కొనసాగుతున్నారు.

ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ గ్రాస్ రూట్ లెవెల్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అలాంటిది కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి వస్తుంది అని చింతా మోహన్ చెప్పడం అంటే నిజంగా ఆయనకు పార్టీ మీద ఉన్న అవ్యాజమైన అభిమానాన్ని అది తెలియచేస్తోంది అనుకోవాలి.

ఏపీకి అంతరిక్ష కేంద్రం నెహ్రూ ఇచ్చారని, రాజీవ్ గాంధీ వల్ల సాంకేతిక విప్లవం వచ్చి అంతా సెల్ ఫోన్లు ఈ రోజు వాడుతున్నారని, దళితులకు దేవాలయ దర్శనం అయినా బడుగులకు భవిష్యత్తు అయినా కాంగ్రెస్ వల్లనే అని చింతా మోహన్ చెప్పుకున్నారు. ఆయన చెప్పినది నిజమే కావచ్చు. కానీ ప్రజలు మారారు. జనరేషన్స్ మారిపోయాయి.

నాడు కాంగ్రెస్ ఎంతో చేసింది అంటే దానికి తగిన అధికార ఫలితాలను కూడా తీసుకుంది కదా అన్న వాదన ఎవరైనా చేస్తారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ దేశంలో పాలన చేసింది అంటే నాడు జనాల ఆదరణ అలా ఉండేది. ఇపుడు కాలం మారింది. అప్ టూ డేట్ గా ఉండాలి. మరి కాంగ్రెస్ నేతలు ఆ విధంగా తమ తప్పులను దిద్దుకుని ముందుకు వస్తే ఏపీలో అవకాశం ఉంటుందేమో. అయినా అది వచ్చే ఎన్నికల్లో అంటే మాత్రం అత్యాశ కంటే పెద్ద మాటే వాడాలి.
Tags:    

Similar News