కేసీఆర్ మౌనాన్ని అలా అనేస్తే ఎలా చింత‌కాయ‌ల‌!

Update: 2019-05-01 05:24 GMT
మౌనంగా ఉండ‌టం కూడా ఒక అర్టే. ఎప్పుడు నోరు విప్పాలో.. ఎప్పుడు నోటిని మౌనంతో క‌ట్టేసుకోవాలో తెలిసిన రాజ‌కీయ నాయ‌కుడు ఎక్కువ కాలం రాణిస్తాడు. అందుకు భిన్నంగా ఎప్పుడు ప‌డితే అప్పుడు.. ఏ విష‌యం మీద ప‌డితే ఆ విష‌యాన్నిప్ర‌స్తావించే వారి మాట‌ల‌కు విలువ ఉండ‌దు.

ఎన్నిక‌లు పూర్త‌యి.. ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్న వేళ‌.. ఏపీ అధికార‌ప‌క్ష నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్య‌లు అన‌వ‌స‌ర‌మైన‌వన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కెలుక్కోవ‌టంలో త‌ప్పు లేదు కానీ.. తాము కెలికిన కెలుకుడు త‌ర్వాతి రోజుల్లో త‌మ‌కు షాకులిచ్చేలా ఉండ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని తెలుగు త‌మ్ముళ్లు మ‌ర్చిపోతున్న‌ట్లుగా ఉంది. తాజాగా కొంద‌రు ఏపీ టీడీపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పాలి.

తాజాగా ఏపీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ఆయ‌న కుమారుడు కేటీఆర్ లు ఇద్ద‌రూ ఇటీవ‌ల కాలంలో మౌనంగా ఉంటున్నార‌ని.. బాబు గెలుపున‌కు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పుకొచ్చారు.

ఎన్నిక‌ల ముందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును.. టీడీపీ ప్ర‌భుత్వాన్ని.. ప్ర‌త్యేకించి ఆంధ్రుల‌ను ఉద్దేశించి కించ‌ప‌రిచేలా కేసీఆర్.. ఆయ‌న కుమారుడు కేటీఆర్ లు మాట్లాడార‌న్నారు. అయితే.. పోలింగ్ జ‌రిగిన తీరును గ‌మ‌నించిన త‌ర్వాత మాత్రం వారిద్ద‌రూ కామ్ గా ఉంటున్నార‌న్నారు. తెలంగాణ రాష్ట్ర నిఘా విభాగం వారు ఇచ్చిన నివేదిక‌తోనే తండ్రీకొడుకుల నోట మాట రావ‌టం లేద‌న్నారు.

ఆంధ్రాలో జ‌గ‌న్ కు సీన్ లేద‌ని.. చంద్ర‌బాబు కాబోయే ముఖ్య‌మంత్రిగా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏపీలో బాబు గెలుస్తార‌న్న ధీమాను ప్ర‌ద‌ర్శిస్తున్న చింత‌కాయ‌ల‌.. అందుకు కార‌ణం కేసీఆర్ మౌనమే అంటూ చేస్తున్న విశ్లేష‌ణ కామెడీ ఉంద‌ని చెప్పాలి. కొన్ని విష‌యాల మీద కేసీఆర్.. కేటీఆర్ లు ఇద్ద‌రూ వ్యూహాత్మ‌క మౌనాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటారు. తాజా మౌనాన్ని చింత‌కాయ‌ల వినిపించే వాద‌న‌కు భిన్న‌మైన వాద‌న‌ను కూడా చెప్పొచ్చు.

వ‌చ్చేది జ‌గ‌న్ ప్ర‌భుత్వం కావ‌టం.. అందులో త‌మ పాత్ర ఏమీ లేద‌ని.. జోక్యం అస్స‌లు ఉండ‌ద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్ప‌టంతో పాటు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు వీలుగా మౌనంగా ఉన్నార‌ని కూడా అనుకోవ‌చ్చు. కేసీఆర్.. కేటీఆర్ ల మౌనానికి అస‌లుసిస‌లు భాష్యం.. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాక ప్ర‌స్తావిస్తే బాగుంటుంది. అందుకు భిన్నంగా నాలుగు మాట‌ల్ని మాట్లాడేయ‌టం ద్వారా చింత‌కాయ‌ల లాంటి సీనియ‌ర్ నేత త‌న ఇమేజ్ ను తానే త‌గ్గించుకున్న‌ట్లుందని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News