మోడీకి హనుమంతిలా వ్యవహరించాడట.. కష్టంలో హ్యాండిచ్చారట

Update: 2021-06-26 13:30 GMT
ఇటీవల కాలంలో చిరాగ్ పాశ్వాన్ పేరు మీడియాలో ఎక్కువగా వినిపించింది. అతగాడి వ్యవహరం రచ్చగా మారి.. జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించటం లాంటివి చోటు చేసుకున్నాయి. తాజాగా అతగాడు ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ఒక రకంగా బరస్ట్ అయ్యారు. ఇందులో ప్రధాని మోడీ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాముడికి హనుమంతిడి మాదిరి.. మోడీ తీసుకునే ప్రతి నిర్ణయానికి తాను మద్దతు ఇచ్చినా.. తాను కష్టంలో ఉన్నప్పుడు ఆయన అసలు చూడలేదని.. పట్టించుకోలేదని వాపోయారు.

ఇంతకీ ఈ చిరాగ్ పాశ్వాన్ ఎవరు? అతగాడి వేదన ఏంటి? మోడీ మీద అతడు చేసిన వ్యాఖ్యల వెనుక లెక్కేంటి? అన్న విషయంలోకి వెళితే.. సుపరిచితుడైన రామ్ విలాస్ పాశ్వాన్ అనే పెద్ద మనిషి ఉన్నారు కదా. ఆయన కుమారుడే చిరాగా్ పాశ్వాన్. ఇక్కడే ఇంకో విషయాన్ని చెప్పాలి. లోక్ జనశక్తి పార్టీ జాతీ అధ్యక్షుడిగా.. కేంద్రమంత్రిగా వ్యవహరించే రాంవిలాస్ పాశ్వాన్ ఈ మధ్యనే కాలం చేశారు. దీంతో.. తండ్రి రాజకీయ వారసత్వం కొడుకుగా చిరాగ్ పాశ్వాన్ కు వచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇక్కడే లెక్క తేడా వచ్చింది. తమ పార్టీకే చెందిన తమ బాబాయ్ పశుపతి నలుగురు ఎంపీలతో కలిసి పార్టీలో తిరుగుబాటు చేశారు.

చిరాగ్ చేతిలో ఉన్న పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అంతేకాదు ఎల్జీపీ పార్లమెంటరీ నేతగా పశుపతి ఉంటారని రెబల్ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న తనకు దన్నుగా నిలుస్తారని ఆయన మోడీ వంక చూశారు. ఎప్పటిలానే తనకు సంబంధం లేనట్లుగా ఉండిపోయారు. ఈ వేదన నుంచి పుట్టిన కసితో ఇప్పుడు పాశ్వాన్ అసలు వారసుడు ఎవరో ప్రజలు తేలుస్తారంటూ చిరాగ్.. వచ్చే నెల ఐదు నుంచి ఆశీర్వాద యాత్ర చేసేందుకు డిసైడ్ అయ్యారు.

ఈ సందర్భంగా ఒకచానల్ తో మాట్లాడిన చిరాగ్.. ''దేశ ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని తీసుకున్న ప్రతి నిర్ణయానికి మేం మద్దతు ఇచ్చాం. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ పార్టీ మాత్రం వీటికి అనుకూలంగా లేదు. అయినప్పటికీ ఈ హనుమంతుడు రాముడి కోసం అన్నింటికీ సిద్ధమయ్యాడు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా ప్రధాని నా వైపు ఉంటారని ఆశించాను. అలా జరగలేదు. ఈ సమస్యను నాకు నేనుగా పరిష్కరించుకోవాలని భావించా'' అని పేర్కొన్నారు.

తనకు ఎవరూ సహకారం అందించరని అర్థమైందని.. అందుకే తనకు తానుగా సమస్యల్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన సొంత కుటుంబ సభ్యులే తనకు వెన్నుపోటు పొడిచారని.. తండ్రి లాంటి బాబాయ్.. నొ కొడుకు లాంటి సోదరుడు ప్రిన్స్ రాజ్  తనకు ద్రోహం చేశారన్నారు. ''బాబాయ్.. నా కంటే పెద్దవారు. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడాల్సింది. ఇద్దరం కలిసి పరిష్కారం వెతికేవాళ్లం. ఆయన ఇలా చేయటం సరికాదు. నాకు మాత్రమే కాదు ఆయన నాన్నకు కూడా ద్రోహం చేశారు. ఇదంతా చూస్తే.. నాన్న సంతోషంగా ఉండరు'' అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. తాజా పరిణామాలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
Tags:    

Similar News