కాపుముద్రకు చిరు సిద్ధమేనా?

Update: 2016-08-30 14:12 GMT
మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు తన రాజకీయ ఫోకస్‌ ను తగ్గించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ శవాసనం వేసి ఉన్న నేపథ్యంలో.. తాను ఎంత చురుగ్గా పార్టీ ని భుజాన మోసినా ప్రయోజనం ఉండదని ఆయన విరామం తీసుకుని ఎంచక్కా సినిమా చేస్తున్నారు. మంచిదే. కానీ ఆయన రాజకీయాలను పూర్తిగా వదిలేసినట్లు కాదు. రాజకీయాల విషయం ఓకే గానీ.. కాపు ఉద్యమం విషయంలోనే చిరు వైఖరి విభిన్నంగా సందేహాస్పదంగా కనిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో తన మీద కాపు ముద్ర పడినా పర్లేదని చిరు సిద్ధపడ్డారా అనిపిస్తోంది.

మెగాస్టార్‌ తనను అందరి మనిషిగా గుర్తించుకోవడానికి ఇష్టపడతారు. తాను కాపు వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ.. ప్రత్యక్షంగా వారి ఉద్యమాల్లో పాలు పంచుకున్నది ఇప్పటిదాకా లేదు. ముద్రగడ దీక్షల్లో పరిస్థితి విషమించాక పరామర్శకు వెళ్లడం తప్ప.. మరో రకంగా.. డైరక్టుగా వారి ఉద్యమంలో చిరు ఎన్నడూ ఇన్వాల్వ్‌ కాలేదు.

అయితే ఇప్పుడు ముద్రగడ హైదరాబాదు వచ్చిన నేపథ్యంలో ఆయన వైఖరి కొత్త అనుమానాలకు తావిస్తోంది. మద్దతు కోసం ముద్రగడ వెళ్లి చిరంజీవిని కలిస్తే అందులో వింతేమీలేదు. కానీ దాసరి ఇంట్లో బొత్స అంబటి ముద్రగడ తదితర నాయకులతో కలిసి చిరంజీవి భేటీ కావడం అనేది.. కాపు ఉద్యమంలోకి ఆయన క్రియాశీలంగా ప్రవేశిస్తారా అనే అనుమానాలు కలిగిస్తోంది. చిరు అందరివాడుగా ఉండాలని కోరుకునే వ్యక్తి కదా, కాపు ఉద్యమానికి కావలిస్తే మద్దతు ఇస్తారు తప్ప.. స్వయంగా పూనుకుంటారా? అనే అనుమానం అభిమానుల్లో ఉంది. అందరివాడుగా ఉన్నందువల్ల ఎటూ రాజకీయాల్లో దక్కిందేమీ లేదు గానీ.. కనీసం కాపు కార్డు ను నమ్ముకుంటే లాభం ఉంటుందని ఆయనకు అనిపిస్తోందా అని కొందరు భావిస్తున్నారు.
Tags:    

Similar News