మెగా హీరోలు.. రాజకీయాలపై ధైర్యం చాల్లేదా!

Update: 2019-04-06 05:34 GMT
ఒకవైపు పవన్ కల్యాణ్ తన రాజకీయ పార్టీతో వచ్చినా మెగా ట్రూప్ హీరోలు మాత్రం ఎవ్వరూ ఎన్నికల ప్రచారం జోలికి వెళ్లకపోవడం విశేషం. గతంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు  మెగా ట్రూప్ లో ఇంత మంది హీరోలు లేరు. అయితే ఉన్న వాళ్లు మాత్రం ప్రచారానికి రైలు ఎక్కారు. ప్రజారాజ్యం గుర్తు రైలు  కావడంతో.. రైళ్లలో తిరిగి వారు ప్రచారం చేశారు. అయితే అప్పుడు వాళ్లంతా ఇంతటి స్టార్లు  కూడా కాదు.

అయితే  ఇప్పుడు మాత్రం మెగా ట్రూప్ హీరోలు ఎవరూ ప్రచారానికి కదలకపోవడం విశేషం. జనసేనకు పవన్ కల్యాణ్ అధినేత - ఇక నాగబాబు ఆ పార్టీ తరఫున  పోటీలో కూడా ఉన్నారు. అయినా మెగా ట్రూప్ లో ప్రధాన హీరోలు ప్రచారానికి వెళ్లలేదు.

చిరంజీవి జనసేన తరఫున ప్రచారానికి వస్తారని ప్రచారం జరిగింది. అయితే  ఆయనేమో ఈ ఎన్నికల వేడికి దూరంగా టోక్యో వెళ్లిపోయి రిలాక్స్ అవుతున్నారు. ఇక రామ్ చరణ్ గాయపడ్డారట. ఆయన  గాయంతో సినిమా షూటింగ్ కు కూడా దూరం అయ్యాడు. కాబట్టి ఆయన ప్రచారానికి వస్తాడని ఇక చెప్పడానికి లేదు. అయితే రామ్ చరణ్ ఫేస్ బుక్  లో ఒక పోస్టు పెట్టారు.

నాగబాబు తనయుడు కూడా ప్రచారం వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. సాధారణంగా తండ్రులు పోటీ చేస్తున్న సమయంలో వారి తనయులు ప్రచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే నాగబాబు ప్రచారానికి మాత్రం ఆయన తనయుడు రాకపోవడం విశేషం.

ఇక అల్లు అర్జున్ ప్రచారానికి దిగుతాడని - ఆయన నాగబాబు తరఫున ప్రచారం చేయడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే… ఆయన కూడా సోషల్ మీడియా నోట్ తో చేతులు దులిపేసుకున్నాడు. మొత్తానికి మెగా హీరోలు తమ మద్దతు జనసేనకే అంటూనే..  పూర్తిగా మాత్రం రంగంలోకి దిగడానికి వెనుకాడుతున్నట్టుగా ఉన్నారనే  టాక్ వినిపిస్తోంది!

Tags:    

Similar News