జగన్ నిర్ణయం పై స్పందించిన చిరంజీవి

Update: 2019-12-12 04:57 GMT
దిశ పై హత్యాచారం ఘటన పై కొద్దిరోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ గా స్పందించారు. దిశ నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలంటూ వీడియోలో తన ఆవేదన వెళ్లగక్కాడు.. దిశ కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆడవారి భద్రతపై అనుమానాలకు దారితీస్తోంది.

ఈ నేపథ్యంలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను ఇటీవలే సపోర్టు చేసిన సీఎం జగన్..ఏకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ‘దిశా చట్టం- 2019’ పేరుతో మహిళల కోసం కఠిన చట్టాన్ని తెస్తున్నట్టు కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతోన్న చిన్నారులకు ఈ చట్టం భరోసానిస్తుందని.. భద్రత కల్పిస్తుందని జగన్ తన చేతలతో చాటిచెప్పారు.

జగన్ ‘దిశ చట్టం’ చేయడం పై మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ చట్టం మహిళలు, చిన్నారులకు భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ నాలో ఉందన్నారు. దిశకు తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం అందరిలో ఉందన్నారు. అందుకే అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ లో తొలి అడుగులు పడడం హర్షణీయమని చిరంజీవి కొనియాడు.

ఇక సీఆర్పీసీ(CRPC) ని సవరించడం ద్వారా 4 నెలలు అంతకంటే ఎక్కువ పట్టే విచారణ సమయాన్ని 21 రోజులకు కుదించడం జగన్ తీసుకున్న గొప్ప స్టెప్ అంటూ చిరంజీవి కొనియాడారు. ప్రత్యేక కోర్టులు ఇతర మౌళిక సదుపాయాల్ని కల్పించడంతో పాటు ఐపీసీ(IPC) ద్వారా సోషల్ మీడియాలో మహిళల గౌరవాన్ని కించపరచడం లాంటివి చేస్తే తీవ్రమైన శిక్షలు విధించడం చాలా మంచి నిర్ణయం అన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం ద్వారా నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా చట్టాలు తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని జగన్ నిర్ణయాన్ని చిరంజీవి వేయినోళ్ల పొగిడేశారు.


Tags:    

Similar News