'రా’ ఏజెంట్లు కొట్టారు.. ఆంటిగ్వా లో చోక్సీ సరికొత్త వాదన !

Update: 2021-07-26 11:30 GMT
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ ను రూ.13,500 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆంటిగ్వా నుంచి తనను కిడ్నాప్ చేసినవారిలో ఇద్దరు 'రా' (రీసెర్చ్అండ్ ఎనాలిసిస్ వింగ్) కి చెందినవారని చెప్పాడు. ఆంటిగ్వా లో ఉన్న ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..  కిడ్నాపింగ్ సమయంలో గుర్మీత్ సింగ్, గుర్ జిత్ భండాల్ అనే వ్యక్తులు తనని కొట్టారని వెల్లడించాడు. అప్పుడు తాను బార్బరా జరాబికా అనే మహిళ ఇంట్లో ఉన్నానని, అక్కడ తనపై దాడి జరుగుతుండగా ఈ ఇద్దరు వ్యక్తులూ తమను 'రా' ఏజెంట్లుగా చెప్పుకున్నారని అన్నాడు.

డొమినికాకు చేరినప్పుడు సైతం ఈ ఇద్దరూ తన కాళ్ళు, చేతులు పట్టుకుని, ఇష్టం వచ్చినట్టు కొట్టారని , తనకు స్పృహ కోల్పోయినంత పనయిందన్నాడు. గతంలో ఒకసారి తన కిడ్నాపింగ్ జరిగినప్పుడు ఈయన డొమినికా పోలీసులే తనను తీవ్రంగా కొట్టినట్టు చెప్పిన విషయం గమనార్హం. కానీ ఇప్పుడు 'రా' ఏజంట్ల గురించి చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరూ ఈ ద్వీప సముదాయాల చుట్టూ, ప్రపంచ దేశాల్లోనూ తిరుగుతుంటారని తెలిసినట్టు తెలిపారు.

 నిజానికి తనను అపహరించుకు పోవడానికి కుట్ర జరిగిందన్న విషయం తనకు ముందే..అంటే 2019 లోనే తెలిసిందని, ఇండియా నుంచి ఓ విమానం వచ్చి నిన్ను ఆ దేశానికి తీసుకువెళ్తుందని కొందరు చెప్పారని చోక్సీ వివరించాడు. ఇండియా ఆంటీగ్వాకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిందంటే ఇక ఇక్కడి నుంచి నిన్ను తీసుకువెళ్లేందుకే అని వారు చెప్పారన్నాడు. అంటే ఇది రిటర్న్ గిఫ్ట్ అని వారు వ్యాఖ్యానించారని అన్నాడు. ఇండియా కుట్ర విషయం నాకు తెలుసు అని చోక్సీ పేర్కొన్నాడు. ప్రస్తుతం డొమినికా కోర్టు నుంచి బెయిల్ మీదున్న ఈయన.. తాను ఇండియాకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పాడు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసులో ప్ర‌ధాన‌ నిందితుడిగా ఉన్న‌ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ డొమినికా రిపబ్లిక్ దేశంలో పట్టుబట్టారు. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకును బురిడీ కొట్టించి దేశం వదిలి వెళ్లిపోయారు. అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన 13,500 కోట్ల రూపాయల పీఎన్‌ బీ స్కాంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (48), అతని మామ, మెహుల్ చోక్సీ( 60) ప్రధాన నిందితులుగా ఉన్నారు. గత ఏడాది లండన్‌లో అరెస్టయి, ప్రస్తుతం వాండ్స్‌ వర్త్ జైలులో ఉన్న నీరవ్ మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. నీరవ్ మోడీ తో పాటు పీఎన్బీ స్కాంలో సహ నిందితుడిగా ఉన్న మోహుల్ చోక్సీ, అక్కడి నుంచి క్యూబాకు వెళ్లాలని స్కెచ్ వేశాడు.

ఈలోపు అంటిగ్వా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో చోక్సీకి గుర్తించిన డొమినికా పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పీఎన్‌ బీ స్కామ్‌ ప్రధాన నిందితుడు మెహుల్‌ చోక్సిని ఆంటిగ్వా నుంచి బలవంతంగా అపహరించడం వెనుక తమ ప్రభుత్వ ప్రమేయం ఉందన్న ఆరోపణలను డొమినికా ప్రధాని రూజ్‌వెల్ట్‌ కొట్టి పారేశారు. ఆ దేశంలో ప్రసారమయ్యే ఒక వీక్లీ షోలో పాల్గొన్న రూజ్‌వెల్ట్, ఇవన్నీ అర్ధం లేని ఆరోపణలని వ్యాఖ్యానించారు.

కోర్టు తన పని తాను చేస్తుందని, అలాగే తమ రాజ్యాంగం ప్రకారం చోక్సి ఉన్న హక్కులకు రక్షణ లభిస్తుంది అన్నారు. ఆయనకు అక్కడ బెయిల్ రావడంతో.. ఎలాగైనా భారత్ కు రప్పించాలని ఇక్కడి అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం ఏర్పడింది. ఇప్పట్లో చోక్సీని భారత్ కు రప్పించడం అసాధ్యమనే వాదన వినిపిస్తోంది. భారత్ కు రావడం ఇష్టం లేకనే ఇలా అనారోగ్య కారణాలు చూపుతున్నారని అనుమానిస్తున్నారు. అయినా భారత ప్రభుత్వం మాత్రం ఎలాగైనా చోక్సీని రప్పిస్తామంటోంది.
Tags:    

Similar News