చౌకీదార్ ఎంట్రీ!..బాబుకు స్లీప్‌ లెస్ నైట్స్!

Update: 2019-02-10 16:40 GMT
నిర‌స‌న‌లు - ధర్నాల మ‌ధ్యే ప్ర‌దాన మంత్రి న‌రేంద్ర మోదీ ఏపీ టూర్ ముగిసిపోయింది. టీడీపీతో బీజేపీ మైత్రి ముగిసిన త‌ర్వాత తొలిసారిగా ఏపీకి వ‌చ్చిన మోదీ... గుంటూరు బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వ‌స్తారంటూ టీడీపీ - కాంగ్రెస్‌ - వామ‌ప‌క్షాలు - ప్ర‌జా సంఘాలు ఎంత గీపెట్టినా... మోదీ తాను అనుకున్న మేర‌కు గుంటూరులో అడుగుపెట్టి... తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పేసి వెళ్లిపోయారు. దాదాపుగా గంట పాటు సాగిన త‌న ప్ర‌సంగంలో ఏపీకి ఏమి చేస్తామ‌న్న విష‌యానికి అంత‌గా ప్రాధాన్యం ఇవ్వ‌ని మోదీ... ఇప్ప‌టిదాకా ఏం చేశామ‌న్న విష‌యాన్ని కాస్తంత లైట్‌గా ట‌చ్ చేసి... ప్ర‌సంగం మొత్తం కూడా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై విమ‌ర్శ‌లు సంధించేందుకే ప్రాధాన్యం ఇచ్చార‌ని చెప్పాలి. నాలుగేళ్ల పాటు త‌మ‌తో క‌లిసి సాగిన చంద్రబాబు... ఏ ప్ర‌యోజ‌నాల‌ను ఆశించి త‌మ‌తో విభేదించార‌న్న విష‌యాన్ని కూడా ఓ మోస్త‌రుగా ప్ర‌స్తావించిన మోదీ... చంద్రబాబును యూట‌ర్న్ నేత‌గా అభివ‌ర్ణించేశారు.

ఇక బాబుపై మోదీ సంధించిన విమ‌ర్శ‌ల విష‌యానికి వ‌స్తే.. ఏపీని స‌న్ రైజ్ స్టేట్‌ గా చెప్పుకుంటున్న చంద్ర‌బాబు... రాష్ట్రానికి బ‌దులుగా త‌న కుమారుడి ఉన్న‌తికే ప్రాధాన్యం ఇస్తూ... స‌న్ రైజ్ స్టేట్ అర్ధాన్నే మార్చేశార‌ని ఆరోపించారు. ఇక ఏపీ అభివృద్దికి కేంద్రం ఇచ్చిన ప్ర‌తి పైసాకు లెక్క‌లు చెప్పాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపై ఉంద‌ని - ఈ విష‌యంలో తాము నిక్క‌చ్చిగానే వ్య‌వ‌హ‌రించబోతున్నామ‌ని చంద్ర‌బాబుకు డేంజ‌ర్ సిగ్న‌ల్స్ పంపారు. అయినా ఇప్పుడు చంద్ర‌బాబు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌న్న విష‌యాన్ని బాగానే హైలెట్ చేసిన మోదీ... స‌ర్కారీ నిధుల‌కు కాప‌లాదారు (చౌకీదార్‌)గా ఉన్న త‌న‌ను చూసి చంద్ర‌బాబు నిద్ర‌లేని రాత్రుల‌ను గ‌డుపుతున్నార‌ని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ప‌క్కాగానే ఖ‌ర్చు పెట్టి ఉంటే.. చంద్ర‌బాబుకు ఈ ప‌రిస్థితి వ‌చ్చేదే కాద‌ని కూడా మోదీ వ్యాఖ్యానించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల‌ని నిధులు విడుద‌ల చేస్తే.. చంద్ర‌బాబు మాత్రం త‌న ఇష్టారాజ్యంగా ఖ‌ర్చు చేశార‌ని, అందుకే తాము లెక్క‌లు అడుగుతుంటే ఎక్క‌డ త‌న మోసం బ‌య‌ట‌ప‌డిపోతుందోన‌న్న బెంగ‌తో భ‌య‌ప‌డిపోతున్నార‌ని మోదీ ఆరోపించారు. మొత్తంగా త‌న నిక్క‌చ్చి పాల‌న‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంలా తాను వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటే... చంద్ర‌బాబుకు మాత్రం నిద్ర లేని రాత్రులే మిగులుతున్నాయ‌ని మోదీ ఓ భారీ పంచ్ డైలాగ‌ను విసిరారు. రాష్ట్రాభివృద్దిని గాలికి వ‌దిలేసిన చంద్ర‌బాబు... త‌న‌ను తిట్టిపోసేందుకు మాత్రం ఇత‌ర పార్టీల నేత‌ల‌తో పోటీప‌డుతున్నార‌ని కూడా మోదీ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. ఇక త‌న ప్ర‌సంగంలో చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్ పేరును ప‌లుమార్లు ప్ర‌స్తావించిన మోదీ... టీడీపీ అవినీతి పాల‌న‌నే టార్గెట్ చేసుకుని త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News