కరోనా తో సీఐ మృతి.. ఎమ్మెల్యే అనంత, ఎంపీ గోరంట్ల సంతాపం !

Update: 2020-07-15 09:45 GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి  సామాన్య ప్రజలతో పాటు వైద్యులు, పోలీసులను కూడా భయపెడుతుంది. తాజాగా ఏపీలో ఓ పోలీస్ అధికారి కరోనా భారిన పడి కోలుకోలేక కన్నుమూశారు. అనంతపురం ట్రాఫిక్‌ సీఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్‌  కరోనా బారినపడి మంగళవారం కన్నుమూశారు. ఈయన కొన్నేళ్లుగా మధుమేహ వ్యాధితో బాధపడుతుండేవారు. ఆరోగ్యం క్షీణించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ‌కు తరలిస్తుండగా కర్నూలు దాటిన తరువాత పరిస్థితి పూర్తిగా విషమించడంతో , కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈయన కు భార్య శిరీషతో పాటు బీటెక్‌ చదువుతున్న కుమారుడు ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు కరోనా విధుల్లో పాల్గొంటూ అందరితో కలిసి ఉన్న సీఐ రాజశేఖర్‌ ఇలా అకస్మాతుగా అనారోగ్యం బారిన పడి మృతి చెందడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఐ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్న సమయంలో తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని అన్నారు. సీఐ రాజశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు. అలాగే , సీఐ రాజశేఖర్‌ మృతి పోలీసు శాఖకు తీరని లోటని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అనేక సంవత్సరాలుగా వివిధ హాదాల్లో సమర్థవంతంగా పనిచేశారన్నారు.

కాగా, ఏపీలో ఇప్పటి వరకు 33,019 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా నుంచి 17,467 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 408 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 15,144 కరోనా యాక్టివ్ కేసులున్నాయి
Tags:    

Similar News