ఇండియాలో అమెరికా సర్వే.. ఏం జరిగిందంటే.

Update: 2019-04-26 10:35 GMT
ఇండియాలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే విషయంపై అమెరికా గుఢచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) పేరుతో ఇంటర్నెట్ లో ప్రచారంలోకి వచ్చిన సర్వే దేశంలో దుమారం రేపింది. అమెరికా నిఘా సంస్థ తయారు చేసిందనడంతో చాలా మంది షేర్ చేసి వైరల్ చేశారు. ఈ సర్వేలో దేశంలో ఈసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 177 సీట్లను దాటదని.. బహుశా 145 సీట్లకే పరిమితం కావచ్చన్న అంచనాలను రూపొందించింది.

బీజేపీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోతుందని సీఐఏ చెప్పిందని బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) అధికారిక లోగోతో ఒక ప్రకటన   వెబ్ సైట్ లలో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇందులో చాలా అస్పష్టమైన వివరాలు పొందుపరిచారు. ప్రధాని నరేంద్రమోడీని ఈసారి దేశ ప్రజలు నమ్మలేదని ఆ లెటర్ లో కింద పేర్కొన్నారు. దీన్ని పట్టుకొని దేశంలోని ప్రముఖ వార్త చానెళ్లు అన్నీ తెగ ప్రచారం చేశాయి. అయితే తాజాగా ఈ ప్రకటన నకిలీదని ఇండియా టుడే చానెల్ గుర్తించింది.

ఇండియా టుడే బీబీసీని సంప్రదించి ఈ సీఐఏ ప్రకటన నకిలీదని తేల్చింది. బీబీసీ అసలు దీన్ని ప్రచురించలేదని వివరణ ఇచ్చింది. ఆ ప్రకటనలో చాలా గ్రామర్ తప్పులు ఉన్నాయని బీబీసీ లాంటి సంస్థ ఇలా తప్పులు ప్రచురిస్తుందా అని సంస్థ తప్పుపట్టింది. ఇన్ని తప్పులున్న పత్రాన్ని రూపొందించింది బీబీసీ కాదని ఆ సంస్థ స్పష్టం చేసింది.

ఇక ఆ నకిలీ సర్వేలో ప్రచురించిన వెబ్ సైట్ కూడా నకిలీదని తేలింది. ఆ వెబ్ సైట్ పై క్లిక్ చేయగా వార్త లేదు.. సర్వే లేకపోవడంతో ఇది ఫేక్ అని తేలింది.

ఇండియా టుడే ఈ సీఐఏ సర్వే అసలుదా నకిలీదా అని బీబీసీని నేరుగా సంప్రదించింది. దీనిపై బీబీసీ వివరణ ఇచ్చింది. ‘ఇదో నకిలీ సర్వే. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఈ నకిలీ సర్వేను నమ్మకమైన తమ బీబీసీ బ్రాండ్ తో వాట్సప్ , ఫేస్ బుక్ లలో ప్రచారం చేశారు. ఇది బీబీసీ రిపోర్ట్ కాదు.. దీనికి బీబీసీకి సంబంధం లేదు. అసలు దీన్ని బీబీసీ రూపొందించలేదు. భారత్ లోని ఎన్నికలపై బీబీసీ ఎలాంటి సర్వేను, ప్రకటనను విడుదల చేయలేదు’ అని బీబీసీ అధికారికంగా వివరణ ఇచ్చింది.  దీంతో బీజేపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.
    

Tags:    

Similar News