రోటీన్ కు భిన్నమైన వ్యాఖ్యలు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

Update: 2021-12-27 02:30 GMT
దేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్న ఎన్వీ రమణ.. తాను సీజేఐ పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి తన సొంత రాష్ట్రానికి.. సొంతూరుకు రావటం తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజున ఆయన గుంటూరులోని సిద్ధార్థ బీటెక్ కాలేజీలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రోటీన్ కు భిన్నమైన అంశాల్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నో ఏళ్లుగా న్యాయవ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటుందన్న ఆయన.. వ్యక్తుల స్వేచ్ఛను కాపాడటంతో న్యాయవ్యవస్థ కీలక పాత్ర అని చెప్పారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటుందన్న ఆయన.. ఇంటర్నెట్ కేంద్రంగా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. పరువుకు భంగం కలిగించే కంటెంట్ ను ఇంటర్నెట్ లో ప్రచారం చేస్తున్నారని.. ఇవన్నీ న్యాయవ్యవస్థకు సవాళ్లుగా మారాయన్నారు.

ఎగ్జిక్యూటివ్.. శాసన వ్యవస్థల్లో ఉల్లంఘనలు జరిగితే దాన్ని సరిదిద్దే పాత్ర న్యాయవ్యవస్థదే అన్న ఆయన.. క్రిమినల్ చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగునంగా మార్పులు రావాల్సి ఉందన్నారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక నిపుణుల భాగస్వామ్యం ఉండాలన్నారు. మనీ లాండరింగ్.. వర్చువల్ కరెన్సీ ద్వారా క్రైమ్ ఫండింగ్ జరుగుతుందన్నారు.

పెండింగ్ కేసుల్లో 46 శాతం ప్రభుత్వ కేసులే ఉన్నాయని.. వాటిల్లో ఎక్కువగా భూ సంబంధిత వ్యవహారాల కేసులేనని చెప్పారు. అందరి సహకారం ఉంటేనే న్యాయ వ్యవస్థ సమర్థంగా పని చేయగలదన్న ఆయన.. చట్టాలు చేసే ముందు న్యాయపరమైన అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా? లేదా? అనేది సమీక్షించుకోవాలన్నారు.

ఇటీవల జడ్జిలపై భౌతికదాడులు పెరిగాయని.. అనుకూల తీర్పులు రాకుంటే జడ్జిలపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ తరహా ఘటనలపై విచారణ జరగాలని.. కోర్టులు ఆదేశిస్తేనే విచారణ ముందుకు వెళుతుందన్నారు. ‘‘ఇది దురదృష్టకరం. జడ్జిలకు స్వేచ్ఛ వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. జడ్జిల నియామకంలో అనేక వ్యవస్థల పాత్ర ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత జడ్జిలకు సరైన భద్రత ఉండడం లేదు. గృహ, వైద్య సదుపాయాలు కూడా సరిగా ఉండడం లేదు’’ అని అన్నారు. ఇటీవలే కేరళకు చెందిన సీపీఎం రాజ్యసభ సభ్యుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఎంపిక గురించి సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్న వారు తమను తామే ఎంపిక చేసుకుంటారని వ్యాఖ్యానించారు. తాజాగా సీజేఐ ఎన్వీ రమణ మాటల్ని విన్నంతనే సదరు ఎంపీ మాటలు గుర్తుకు వచ్చేలా ఉండటం గమనార్హం.


Tags:    

Similar News