తెలంగాణపై మౌనం అందుకా జగన్?

Update: 2021-06-30 13:30 GMT
ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మంత్రులంతా ఏపీ వాసులపై అంత దుమ్మెత్తిపోస్తున్నా తాను ఎందుకు మౌనంగా ఉంటున్నానో చెప్పుకొచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దూషిస్తున్నా.. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నా..ఏపీలోని పులిచింతల నుంచి నీరు తీసుకుపోతున్నా మౌనంగా ఎందుకు ఉంటున్నానో కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఏపీ సీఎం జగన్ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులతో తాను ఎందుకు మౌనంగా ఉంటున్నానో క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నానని.. మన వాళ్లను ఇబ్బంది పెడుతారనే నేను ఎక్కువగా మాట్లాడటం లేదని మంత్రివర్గ సహచరులతో సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలని ప్రశ్నించారు.

తెలంగాణతో నీటి ఫైట్ విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు జగన్ సూచించారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి విషయంలో మరోసారి కృష్ణా బోర్డుతో ఫైట్ చేయాలని నిర్ణయించారు. జల వివాదాలపై అవసరమైతే ప్రధాని మోడీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ మీడియాకు వైసీపీ వర్గాలే అనధికారికంగా మీడియాకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని.. వస్తున్న విమర్శలకు కౌంటర్ గా ఏపీ ప్రజల్నే జగన్ చూపించారని విశ్లేషకులు చెబుతున్నారు. తాను తెలంగాణతో ఫైట్ చేయకపోవడానికి కారణం తెలంగాణలోని ఏపీ ప్రజలే అని జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ మంత్రులు, సీఎం, రాష్ట్రం అంత దూకుడుగా ఉంటున్నా ఏపీ నేతలు, సీఎం మౌనంగా ఉండడంపై విమర్శలు వచ్చాయి. జగన్ ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు తన మౌనానికి కారణం ఏంటో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ వచ్చాక ఆంధ్రులపై ఎప్పుడూ వివక్ష చూపలేదు. మొదట్లో హల్ చల్ చేసినా తర్వాత అందరినీ కలుపుకుపోయారు. కానీ జగన్ మాత్రం ఇప్పుడు వారినే బూచీగా చూపించడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Tags:    

Similar News