యావ‌త్ దేశం త‌న‌వైపు చూసేలా చేసిన కేసీఆర్‌!

Update: 2018-05-26 04:20 GMT
ఏం చేసినా అదిరేలా చేయాలి. భారీత‌నం కొట్టొచ్చిన‌ట్లుగా ఉండాలి. క‌క్కుర్తి ప‌డిన‌ట్లు కాకుండా.. ఎవ‌రూ ఆలోచించ‌ని రీతిలో.. మ‌న‌కెందుకు ఇలాంటి ఆలోచ‌న‌లు రావు అన్న చందంగా వ్య‌వ‌హ‌రించ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు మాత్ర‌మే సాధ్య‌మేమో?   ఈ మ‌ధ్య‌నే రైతుబంధు పేరుతో భారీ ప‌థ‌కాన్ని అనౌన్స్ చేసి.. అమ‌లు చేస్తున్న హ‌డావుడి ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా మ‌రో భారీ ప‌థ‌కాన్ని అనౌన్స్ చేశారు.

కాకుంటే..ఈ ప‌థ‌కం అమ‌లుకు వ‌చ్చే ఆగ‌స్టును ముహుర్తంగా నిర్ణ‌యించారు.  ఇంత‌కీ ఈ ప‌థ‌కం ప్ర‌త్యేక‌త ఏమిట‌న్నది చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఎవ‌రైనా స‌రే.. ఎలా మ‌ర‌ణించినా స‌రే.. స‌ద‌రు రైతు కుటుంబానికి రూ.5ల‌క్షల ప‌రిహారాన్ని  చెల్లించ‌నున్నారు. స‌ద‌రు రైతు ఎవ‌రికైతే ఈ ప‌రిహార‌పు మొత్తాన్ని ఇవ్వాల‌ని చెబుతారో.. వారికే ఈ మొత్తాన్ని ఇస్తారు.

కార‌ణం ఏదైనా.. రైతు మ‌ర‌ణిస్తే.. అత‌ని కుటుంబం ఇబ్బంది ప‌డుతోంద‌న్న విష‌యాన్ని గుర్తించి.. స‌ద‌రు కుటుంబానికి అండ‌గా నిలిచేందుకు వీలుగా ప్ర‌భుత్వ బీమా సంస్థ అయిన ఎల్ ఐసీతో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 93 శాతం మంది రైతులేన‌ని.. వారికి భూమికి త‌ప్ప మ‌రో ఆధారం లేద‌ని కేసీఆర్ చెబుతున్నారు. అందుకే.. రైతుల‌కు మేలు జ‌రిగేలా తాజా నిర్ణ‌యాన్ని తీసుక‌న్న‌ట్లుగా చెబుతున్నారు.

ప‌రిస్థితులు ఎలా ఉన్నా.. ఏ రీతిలో మ‌ర‌ణించినా.. స‌ద‌రు రైతు కుటుంబానికి రూ.5ల‌క్ష‌లు పరిహారం రూపంలో ప్ర‌భుత్వం ఇవ్వ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. దేశంలో మ‌రే రాష్ట్రంలోనూ ఇంత భారీ ప‌థ‌కం అమ‌లులో లేద‌ని చెబుతున్నారు. సాధార‌ణంగా ప‌లు సంస్థ‌లు త‌మ ఉద్యోగులు మ‌ర‌ణిస్తే ప‌రిహారం అందేలా గ్రూప్ ఇన్స్యూరెన్స్ చేస్తుంటారు. దీనికి భిన్నంగా రైతు కేంద్రంగా.. రాష్ట్రం యూనిట్ గా తీసుకొని భారీ ఎత్తున గ్రూప్ ఇన్స్యురెన్స్ చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్పాలి.

తాజా ప్ర‌క‌ట‌న‌తో రైతు కుటుంబాల్లో సంతోషంతో పాటు.. త‌మ‌కు కేసీఆర్ ఎంతో చేస్తున్నార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వ‌చ్చే ఏడాదిలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు చాలా ముందుగా భారీ ప‌థ‌కాన్ని అనౌన్స్ చేయ‌టం.. దాన్ని వ‌చ్చే ఆగ‌స్టు నుంచి అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌టం ద్వారా.. భారీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నం చేకూర‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఎల్ ఐసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వ‌య‌సున్న రైతులంద‌రి పేర్ల‌ను బీమా ప‌థ‌కం కింద న‌మోదు చేయ‌నున్నారు. ఈ జాబితాలోని రైతులు త‌మ జేబుల్లో నుంచి పైసా బ‌య‌ట‌కు తీయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. వారంద‌రి త‌ర‌పు తెలంగాణ ప్ర‌భుత్వ‌మే ప్రీమియంను చెల్లిస్తుంది. ఈ ప‌థ‌కాన్ని వ‌చ్చే ఆగ‌స్టు 15 నుంచి అమ‌లు చేస్తారు. దీనికి సంబంధించిన ప్రీమియంను ఆగ‌స్టు మొద‌టి తేదీనే ఎల్ ఐసీకి క‌ట్టేయ‌నున్నారు.

రైతులు అంద‌రికి బీమా క‌ల్పించ‌టం దేశ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త రికార్డు సృష్టిస్తుంద‌ని ఎల్ ఐసీ ప్ర‌క‌టించింది. బీమాకు సంబంధించిన రైతుకు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని అంద‌జేయ‌నున్నారు. గ‌తంలో గ్రూపు బీమాలు ఉన్నాయ‌ని.. కాని వాటి విలువ రూ.2ల‌క్ష‌లు మాత్ర‌మే ఉండేద‌ని.. ప్రీమియం భారం ఎక్కువ‌గా ప‌డ‌కుండా ఉండేందుకు చేసేవార‌ని.. అందుకు భిన్నంగా తెలంగాణ ప్ర‌భుత్వం రూ.5ల‌క్ష‌ల భారీ మొత్తాన్ని నిర్ణ‌యించ‌టం గొప్ప‌గా అభివ‌ర్ణించారు.

ప్రీమియం మొత్తం త‌గ్గాల‌ని గ్రూపు బీమా ప‌రిహార మొత్తాన‌ని త‌గ్గిస్తుంటార‌ని.. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా ఎల్ ఐసీ వెల్ల‌డించింది. ఈ విధానాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌టానికి ప‌లు రూల్స్ ను ఫ్రేం చేశారు. ఈ ప‌థ‌కం దెబ్బ‌కు రైతు బాంధ‌వుడిగా కేసీఆర్ అవ‌త‌రించ‌టం ఖాయ‌మంటున్నారు. సాధార‌ణంగా ఇలాంటి ప‌థ‌కాల్ని ఎన్నిక‌ల్లో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే చేస్తామంటారు. కానీ.. అందుకు భిన్నంగా అధికార పార్టీనే ఈత‌ర‌హాలో భారీ ప‌థ‌కాన్ని తెర మీద‌కు తీసుకురావ‌టం.. దాని అమ‌లు డేట్ ను ఫిక్స్ చేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News