కొత్త కార్యం ఏది మొదలుపెట్టిన భారీతనానికి కేరాఫ్ అడ్రస్ - అద్భుతంగా ఉండాలనే ఆకాంక్షించడంలో ముందుండే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి పలువురు ఆధ్యాత్మికవాదులు - టీఆర్ ఎస్ అభిమానులు కొత్త ప్రశంసను తెరమీదకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే అనేక విప్లవాత్మక పథకాలకు ఆద్యుడైన గులాబీ దళపతి ఆధ్యాత్మిక రంగంలో ఆయన ముద్రను స్పష్టంగా ప్రదర్శిస్తున్నాడని చెప్తున్నారు. ఏకంగా శ్రీకృష్ణదేవరాయులతో పోలుస్తున్నారు. తెలుగునాట - తమిళనాడు పురాతన ఆలయాల్లోని అద్భుత శిల్పసంపద చూడగానే శ్రీకృష్ణదేవరాయలు గుర్తుకొస్తారు. తెలంగాణలో పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్న యాదాద్రి పూర్తైన తరువాత ఇక్కడ ఏర్పాటు చేస్తున్న భారీ శిలా విగ్రహాలతో కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతాడని ఘంటాపథంగా చెప్తున్నారు.
యాదాద్రి వైశిష్ట్యానికి కేసీఆర్ సర్కారు ఇస్తోన్న ప్రాధాన్యతను - యాదాద్రిలో ఏర్పాటవుతోన్న శిల్ప సంపదను చూసి అబ్బుర పడుతున్నవారు ఈ మాటలు అంటున్నారు. వచ్చే మార్చిలో నిర్వహించే బ్రహ్మోత్సవాల నాటికి నారసింహుని ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో భారీ బండరాళ్లు అందమైన విగ్రహాలవుతున్నాయి. కఠిన శిలలు ప్రాచీన శిల్పరూపాలు సంతరించుకుంటున్నాయి. యాదాద్రి ఇప్పుడు ఓ శిల్పాగ్రామమైంది. ఒకవైపు వందలాది శిల్పులు తదేక దీక్షతో శిల్పాలను చెక్కుతున్నారు. మరోవైపు ఆధునిక యంత్రాలతో కొండలను తొలుస్తూ రహదారి నిర్మిస్తున్నారు. పచ్చటి పరదాలను తలపించేందుకు తోటమాలులు - కూలీలు అహోరాత్రులు పని చేస్తున్నారు. ఇప్పుడు యాదాద్రిలో కనిపిస్తోన్న దృశ్యాలివి. ఏడాది కాలంలో మారుతోన్న యాదాద్రి రూపురేఖలను సమీక్షించిన వారు ఈ మాటలు వ్యక్తీకరిస్తున్నారు.
కాకతీయుల శకం తరువాత ఇంత భారీఎత్తు రాతి నిర్మాణాలు చేపట్టడం, అదీ యాదాద్రిని పునర్నిర్మాణానికి అంకితమవ్వడం చరిత్రలో నిలిచిపోయేదని అంటున్నారు. భారీ శిల్పాలకు మెరుగులు దిద్దే స్థపతి సుందరాజన్ మీడియాతో మాట్లాడుతూ...``తమిళనాడులో చోళుల కాలంలోనూ - శ్రీకృష్ణదేవరాయలు - కాకతీయుల కాలంలో కృష్ణశిలతో భారీ విగ్రహాలను ఇలాంటి ఆలయాలను నిర్మించారు. దాదాపు ఐదువందల ఏళ్ల తరువాత ఇంతటి భారీ విగ్రహాలతో ఆలయాన్ని నిర్మించడం ఇదే`` అని స్థపతిగా అనుభవజ్ఞుడైన సుందరరాజన్ తెలిపారు.
ఒకప్పుడు యాదగిరిగుట్ట అంటే చుట్టూ కొండలు, మధ్యలో ఆలయం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు కొత్తరూపం సంతరించుకుంటోంది. నాలుగువైపుల విశాలమైన రోడ్ల నిర్మాణం జరుగుతోంది. దాదాపు 60వేల మంది బస చేసేందుకు వీలుగా విశ్రాంతి భవనాలు నిర్మితమవుతున్నాయి. రోజూ లక్ష మంది భక్తులు దైవదర్శనం చేసుకునేలా నిర్మాణాలు సాగుతున్నాయి. ఒకప్పుడు యాదగిరిగుట్టకు వెళ్మేవాళ్లు రాయిగిరిలో రైలు దిగి టాంగాలో గుట్టకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు రాయిగిరి నుంచే యాదాద్రి ఆలయానికి చేరుకున్నాం అనే భావన కలిగేలా నిర్మాణాల జోరు సాగుతోంది. దసరానాటికి ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామని కానీ, లక్ష్యం పెద్దదన్న విషయం పనులు ప్రారంభమైన తరువాతే అర్థమైందని బాధ్యులు చెప్తున్నారు. మూడు దశల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మొదటి దశలో ప్రధాన ఆలయ పునర్నిర్మాణాన్ని మార్చినాటికి పూర్తి చేయనున్నారు. రెండో దశలో కాటేజీల నిర్మాణం, సుందరీకరణ, టెంపుల్ సిటీ అభివృద్ధి పనులు జరుగుతాయి. ఈ పనులూ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మూడో దశ పనులు త్వరలోనే చేపట్టనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 300 కోట్లు వెచ్చించగా... మరో 500 కోట్లతో పనులు జరుగుతున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా సాగుతోన్న ఆలయ పునర్నిర్మాణ మహాత్కార్యంలో మేం భాగమైనందుకు జీవితం ధన్యమైందని శిల్పులు అంటున్నారు.