జాగ్రత్తలు చెప్పే సారు.. అంతమందితో కలిసి రివ్యూ చేసుడేంది?

Update: 2020-03-20 05:28 GMT
అందరికి జాగ్రత్తలు.. సలహాలు.. సూచనలు చెప్పే పెద్ద మనిషి.. తనకు తాను మరెంత జాగ్రత్తగా ఉండాలి? చెప్పటమే కాదు.. అలాంటివేమీ తాను పాటించనన్న భావన కలిగేలా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును పలువురు తప్పు పడుతున్నారు. కరోనావైరస్ విరుచుకుపడుతున్న వేళ.. మరింత అప్రమత్తత చాలా అవసరం. ఎవరికి వారు స్వీయ నియంత్రణ.. వ్యక్తిగత శుభ్రతతో ఉండటం.. మందికి దూరంగా ఉండటం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉంది.

ఇన్ని ముచ్చట్లు చెప్పే కేసీఆర్ లాంటి పెద్ద మనిషి.. తాజాగా కరోనా వైరస్ మీద అత్యవసరంగా పెద్ద ఎత్తున సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన వైనాన్ని తప్పు పడుతున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన కలెక్టర్లు.. ఎస్పీలు.. ఇతర ఉన్నతాధికారులతో కలిసి కరోనా మీటింగ్ పెట్టటం లో అర్థం లేదన్నారు. నలుగురైదుగురు కంటే ఎక్కువగా గుమికూడదన్న మాటను అదే పనిగా చెప్పే సీఎం కేసీఆర్.. తనకు తాను మాత్రం అలాంటివి పాటించకపోవటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒకవైపు ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే.. మరో వైపు ఇంత భారీ స్థాయిలో సమీక్షను నిర్వహించటం ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయటం తమ ఉద్దేశం కాదని.. కరోనా వైరస్ లాంటి ప్రమాదకరమైన వైరస్ ను అడ్డుకోవటానికి వీలుగా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందంటున్నారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పే సారు.. తొలుత తనకు తాను మరిన్ని జాగ్రత్తలతో ఉండాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సీఎం సాబ్ గుర్తిస్తే మంచిదంటున్నారు.
Tags:    

Similar News