సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

Update: 2021-06-06 01:30 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా కల్లోలంలో వైద్యానికి లక్షలు ఖర్చు చేస్తున్న ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 19 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈనెల 7న డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్యాధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో కరోనా పరిస్థితులు, వైద్యఆరోగ్య తీరుపై సీఎం కేసీఆర్ సమీక్షించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం అత్యంత ఖరీదుగా మారిందని.. పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణలోని మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్,  గద్వాల జిల్లా కేంద్రాల్లో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయన్నారు. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లలో మొత్తం 57 టెస్టులు ఉచితంగా చేయనున్నారు.

ప్రజలకు అన్ని రకాల మెడికల్, డయాగ్నోస్టిక్ టెస్టులు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని కేసీఆర్ తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే అక్కడ టెస్టులు చేసే సదుపాయం లేకపోవడంతో ప్రజలు ప్రైవేటుకు వెళ్లి దోపిడీకి గురికావాల్సి వస్తోందన్నారు.

తెలంగాణలో ప్రజలకు మెరుగైన వైద్యం, అన్నిరకాల వైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇది రాష్ట్ర వైద్య చరిత్రలోనే డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటు గొప్ప సందర్భం అని.. దీనికి ఒక మంచి పేరు కూడా పడుతామని అన్నారు.
Tags:    

Similar News