ఒమిక్రాన్ వేళ.. మనకిది అవసరమా కేసీఆర్?

Update: 2021-12-29 03:58 GMT
ఏం చేయా లో అది చేయకుండా.. ఏం చేయకూడదో అదే చేస్తున్న తీరును ఏమనాలి? ఏలా చెప్పాలి? ప్రపంచ వ్యాప్తంగా హైఅలెర్టు అవుతూ.. ఆచితూచి అడుగులు వేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా.. జాగ్రత్త అన్నది లేకుండా నిర్ణయాలు తీసుకోవటానికి మించింది మరేం ఉంటుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే దీనికి నిదర్శనం.

ఒమిక్రాన్ వేళ.. ఆంక్షలు విధించుకుంటూ వీలైనంత వరకు ఎక్కువ మంది బయట కలుసుకునే అవకాశం లేకుండా పరిమితులు విధిస్తూ.. జాగ్రత్తలు వహిస్తుంటే.. అందుకు భిన్నంగా డిసెంబరు 31 రాత్రి తెలంగాణ లో బార్లు.. క్లబ్బులు.. పబ్బులకు అర్థరాత్రి పన్నెండు గంటల వరకు అనుమతిని ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురి చేస్తోంది.

కొత్త సంవత్సరానికి బంఫర్ ఆఫర్ అన్నట్లుగా 31 రాత్రి మద్యం ఏరులై పారేందుకు వీలుగా.. తాజా నిర్ణయం ఉందని చెప్పాలి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో డిసెంబరు 2021 నెల మద్యం మీద ఆదాయం రూ.3500 కోట్లకు పైగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యాపార వర్గాల్లో జోష్ ను నింపితే.. మిగిలిన వారంతా మాత్రం అందుకు భిన్నంగా.. ఇదేం నిర్ణయం? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత కంటే తప్పు నిర్ణయం ఇంకేం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

తిట్టించుకోవటానికి.. వేలెత్తి చూపించుకోవటానికి తప్పించి మరింకేమీ లేనట్లుగా ఉన్న ఈ నిర్ణయంతో రాష్ట్రానికి కొత్త సమస్యలకు కారణమవుతుందన్న అభిప్రాయం ఉంది. ఒమిక్రాన్ కేసుల వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వీలుగా.. రాత్రి వేళ లో ఆంక్షల్ని విధిస్తూ పలు రాష్ట్రాలు పరిమితులు విధించటం.. రాత్రిళ్లు కర్ఫ్యూ పెట్టటానికి సైతం వెనుకాడని పరిస్థితి.

అందుకు భిన్నంగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ మాత్రం.. డిసెంబరు 31 రాత్రి పన్నెండు గంటల వరకు మద్యం అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వటం గమనార్హం.

అధికారికం గానే అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్ముకునే అవకాశం ఇస్తే.. తక్కువ లో తక్కువ మరో గంట నుంచి రెండు గంటల వరకు ఏదోలా అమ్మటం ఖాయమని చెబుతున్నారు. డిసెంబరు 31 రాత్రి అంటేనే.. పార్టీల వైపు మొగ్గు చూపే యూత్.. ప్రభుత్వ తాజా నిర్ణయం తో ఊగిపోవటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. మద్యం ఏరులై పారటమే కాదు.. పెద్ద ఎత్తున సోషల్ గేదరింగ్ కు అవకాశం ఇచ్చి ఉంటుంది.

సాధారణ రోజుల్లో మద్యం దుకాణాలు ఉదయం పది గంటలకు తెరుచుకొని.. రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంటాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఉదయం 10 గంటలకు తెరిచి.. రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటాయి.కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని.. రాత్రి పన్నెండు వరకు అవకాశం ఇచ్చారు.

అప్పటి వరకు మద్యం షాపుల్ని తెరిచి ఉంచొచ్చని.. మద్యం విక్రయాలు సాగించొచ్చని పేర్కొన్నారు. అంతే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా బార్లు.. పబ్బులు.. క్లబ్బులు.. తెలంగాణ టూరిజం శాఖ అధీనంలోని హోటళ్లు.. ఈవెంట్ పర్మిట్ల కింద లైసెన్సులు పొందిన వారు సైతం డిసెంబరు 31న అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం సరఫరాకు అవకాశం ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి పొరుగన ఉన్న కర్ణాటకలో నైట్ కర్ఫ్యూను విధిస్తే.. మరో సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ ఆంక్షల్ని విధించారు. దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు డిసెంబరు 31 రాత్రి వేళ ఆంక్షల్ని విధిస్తూ ఉత్వర్వుల్ని జారీ చేశారు. అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం మద్యం షాపుల్ని తెరిచి ఉంచుతామని.. పబ్బులు.. క్లబ్బులు.. హోటళ్లు తెరిచి ఉంచొచ్చు అన్న వేళ.. వాతావరణం సందడిగా మారటమే కాదు.. ఒమిక్రాన్ బూచి మనల్ని ఏం చేస్తుందన్నది ఇప్పుడు ఆందోళనగా మారింది.
Tags:    

Similar News