కోటీ 40 లక్షల 98 వేల 486 ఎకరాలు...ఎకరానికి రూ.4వేల చొప్పున రూ.5608 కోట్లు...మొత్తంగా 58.06 లక్షల చెక్కులు! రైతుకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన వినూత్న - విప్లవాత్మక పథకం రైతుబంధు స్థూల స్వరూపమిది! తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగంలో స్వర్ణయుగానికి బాటలు తీస్తూ...ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మదిలో మెదిలిన ఆలోచన ఆచరణ రూపం. బృహత్తరమైన ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ గురువారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ఇందిరానగర్ లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు - ప్రజాప్రతినిధులు చెక్కులను పంపిణీ చేయనున్నారు. గురువారం నుంచి వారంపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పంటసాయం చెక్కులతో పాటు పటిష్ఠమైన భద్రతా ఫీచర్లతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా రైతుల చేతికి చేరనున్నాయి. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని ఈ పథకం ప్రారంభానికి సర్వం సన్నద్ధమైంది. పెట్టుబడి పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.8 వేల చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పంటకు రూ.4వేల చొప్పున వానకాలం - యాసంగి పంటలకు కలిపి ఎకరాకు రూ.8వేల చొప్పున ప్రభుత్వం నుంచి రైతుకు పెట్టుబడి సాయం అందుతుంది. ఇప్పుడు వానకాలం పంట ప్రారంభానికి ముందే ఎకరాకు రూ.4వేలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెడుతున్నారు. ఎవరైనా రైతులు విదేశాల్లో ఉన్నట్టయితే వారి కుటుంబసభ్యులకు చెక్కులు అందిస్తారు.
అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని తన ఫెడరల్ ఫ్రంట్ కు ప్రచారవేదికగా కేసీఆర్ వాడుకుంటున్నారు. ఇతర పార్టీల నేతలు, ఇతర రాష్ట్రాల నేతలు సైతం రైతుబంధు పథకాన్ని అభినందించటంతో ఈ పథకానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లేనని గులాబీ నేతలు భావిస్తున్నారు. అయిటే ఫెడర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఏర్పాట్లలో ఉన్న సీఎం కేసీఆర్... దానికి 'రైతు బంధు' పథకం ప్రారంభోత్సవానికి వేదికగా మార్చుకోవాలని భావిస్తున్నారట... అందులో భాగంగా ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు కూడా పంపించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జనతాదళ్ (ఎస్) చీఫ్, మాజీ ప్రధాని దేవేగౌడ - డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్ - సమాజ్ వాది పార్టీ చీఫ్ - ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ - ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ఆహ్వానిస్తున్నారు. మమతా బెనర్జీ - స్టాలిన్... కేసీఆర్ ఆహ్వానాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ ఆహ్వానాల సంగతి ఇలా ఉంచితే తెల్లవారితే జరగనున్న రైతుబంధు ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి ఎవరు వస్తారు? ఎవరు రారు అనేది ఆసక్తిగా మారింది. అయితే మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఇప్పటికే ముద్రిస్తుండగా... జాతీయ నేతల పేర్లు లేకుండానే కార్డులను ముద్రిస్తున్నట్టు సమాచారం. ఇంతకీ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కేసీఆర్ దోస్తులు వస్తారా? అనేది ఆసక్తిగా మారింది.