టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నిఘా!

Update: 2021-12-18 01:30 GMT
సరిగ్గా చెప్పాలంటే ఎన్నికలు రెండేళ్లు కూడా లేవు. మరోవైపు రెండుసార్లు వరుసగా అధికారంలో ఉండడంతో ప్రజల్లో సహజంగానే వచ్చే వ్యతిరేకత. దీనికితోడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఏక పక్ష ధోరణి. సర్కారేమో ఆర్థిక ఇబ్బందుల్లో.. దూకుడు మీదున్నప్రతిపక్షాలు.. దీంతో టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తం అవుతోంది.

అధికారాన్ని కాపాడుకోవాలని సిద్ధమవుతోంది. భవిష్యత్ కార్యక్రమాలపై పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అందరూ జ‌నంలోనే ఉండాల‌ని.. జ‌నం కోస‌మే తిర‌గాల‌ని ఆదేశించార‌ని స‌మాచారం. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఎవ‌రూ హైద‌రాబాద్, ఇత‌ర ప్రాంతాల‌కు ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకోవ‌ద్ద‌ని కూడా సూచించార‌ట‌.

ప‌లు ప‌థ‌కాలు ప్రారంభించినా స‌క్ర‌మంగా అమ‌లు కాక‌పోవ‌డం.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓడిపోవ‌డం.. ఆ ప్ర‌భావం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై కూడా ప‌డ‌డంతో ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆలోచ‌నా ధోర‌ణిని మార్చినట్లుందని దీన్నబిట్టి తెలుస్తోంది. నేతలకు సంకటమే..

వాస్తవానికి ఎమ్మెల్యేలు, ముఖ్య నేత‌లు వారంలో రెండు మూడు రోజులు జిల్లాల్లో.. మూడు నాలుగు రోజులు హైద‌రాబాద్‌లో ఉంటారు. ఇక‌పై వారంలో ఐదు లేదా ఆరు రోజులు స్థానికంగానే ఉండేందుకు ప్లాన్ చేసుకోవాల‌ని.. జ‌నంలో వ్య‌తిరేక‌త త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.

సీఎం సార్ తాజా ఆదేశాలతో జిల్లాల్లో నేత‌ల ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక చందంగా మారింద‌ట‌. పథకాల అమలులో ప్ర‌జ‌ల్లో క్ర‌మంగా వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డంతో అధికార పార్టీ నేత‌ల్లో గుబులు కనిపిస్తోంది. నిత్యం జనంలో ఉండడం అంటే.. ఆర్థికంగా కూడా క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని భావిస్తున్నార‌ట‌.

నిఘా పెడతాం.. నిర్లక్ష్యంగా ఉండొద్దు

ఎన్నికల కోణంలో సన్నద్ధమవుతూ వ‌చ్చే రెండేళ్లు నిఘా పెడ‌తామ‌ని.. ఎవ‌రూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి వీల్లేద‌నేది టీఆర్ఎస్ నేతలకు ప్రస్తుతం వెళ్లిన ఆదేశాలు. ఎమ్మెల్యేలు నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్య‌ ఉంటున్నారా? లేదా? అనే అంశంపై ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు నిఘా వ‌ర్గాల ద్వారా స‌మాచారం సేక‌రిస్తోంద‌ట‌. ఈ నేప‌థ్యంలో గ్రామాల్లో జ‌రిగే ప్ర‌తీ శుభ‌, అశుభ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యేందుకు నేత‌లు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏ కార్య‌క్ర‌మం కూడా మిస్స‌వ‌కుండా వెళ్లాలని వ్యక్తిగత సహాయకులకు నిర్దేశించినట్లు సమాచారం.
ఖర్చుకు బెంబేలు

ఈ ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో గుబులు కనిపిస్తోంది. ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడేళ్ల‌యినా ప‌థ‌కాల అమ‌లు ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డి మాదిరిగానే ఉండ‌డంతో జ‌నాల్లో తిరిగేందుకు జంకుతున్నార‌ట‌. కులాల వారీగా.. మ‌తాల వారీగా వ‌స్తున్న నిధుల ప్ర‌తిపాద‌న‌ల‌ను సొంత ఖ‌ర్చుతో ఆమోదించేలా ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నార‌ట‌.

దీంతో వ‌చ్చే రెండేళ్లు ఇలాంటివి ఎన్ని భ‌రించాలోన‌ని బెంబేలెత్తుతున్నార‌ట‌. సమ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు నేత‌లు ఎలాంటి ప్ర‌ణాళిక‌లు వేసుకుంటారు..? ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు ఉంటాయి..? జ‌నం వ్య‌తిరేక‌త‌ను దాటుకుంటూ ఎలా ముందుకు వెళ‌తారు..? అనేది వేచి చూడాలి.


Tags:    

Similar News