కరోనా వైరస్: సేవ చేస్తూ మరణిస్తే కోటి రూపాయలు .. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం!

Update: 2020-04-01 16:03 GMT
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు దేశవ్యాప్తంగా 1,700పైగా కేసులు నమోదయ్యాయి. దీనితో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వైద్య బృందం చేస్తున్న సేవకి ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం వారికీ మరింత ఉత్సహాన్ని ఇచ్చేలా కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ సోకితే ..ప్రాణానికే ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా ..వైద్య బృందం ప్రాణాలకి తెగించి మరీ కరోనా కి చికిత్స అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారితో పోరాటంలో ఒకవేళ ఎవరైనా వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. వారు ప్రభుత్వ లేదా పైవేట్ ఏ రంగం వారైనా ఈ మొత్తం అందజేస్తామని తెలిపారు. కోవిడ్‌-19పై పోరులో వారి సేవలు సైనికుల కంటే తక్కువేమీ కాదని కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు.

వైద్యులతో పాటు నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ జాబితా కిందికి వస్తారని అలాగే, ప్రభుత్వ, ప్రైవేట్ అన్న భేదమేమీ లేదని, కరోనా సోకిన వారికి సేవ చేస్తూ పై రంగాల వారు ఎవరు మరణించినా వారికి ఈ సాయం లభిస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. దేశ రక్షణలో భాగంగా ఎవరైనా సైనికుడు ప్రాణాలు కోల్పోతే.. అతడి కుటుంబానికి కోటి రూపాయలు అందిస్తామంటూ సీఎం కేజ్రీవాల్ గతంలో చేసిన ప్రకటన దేశవాసులను కదిలించింది.

తాజాగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్య సిబ్బంది కోసం ఆయన చేసిన ప్రకటన కూడా పలు రాష్ట్రాలకు స్ఫూర్తినివ్వనుంది. ఇకపోతే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. బుధవారం నాటికి 120 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు వైద్యులకు కూడా కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ కావడం కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags:    

Similar News