పవన్ కి సీఎం సీటు... అదీ త్యాగమంటే....?

Update: 2022-05-10 09:30 GMT
త్యాగం అంటూ మాటలతో చెబితే కుదరదు, చేతలలో చూపించాలి. ఇటీవల చంద్రబాబు గోదావరి జిల్లాల టూర్ లో ఏపీలో వైసీపీ సర్కార్ ని గద్దె దించడానికి ఎటువంటి  త్యాగాలు చేయడానికైనా సిద్ధమని బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆయ‌న ఏ ఉద్దేశ్యంతో ఆ స్టేట్మెంట్ ఇచ్చారో తెలియదు కానీ దాంతోనే ఇపుడు వైసీపీ బాబును, టీడీపీని  ఒక ఆట ఆడుకుంటోంది.

దీని మీద ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే ఏం త్యాగం చేస్తారు బాబూ, పవన్ని ముఖ్యమంత్రిని చేస్తారా అని వెటకారం ఆడారు. నిజంగా అంత పని చేయడానికి బాబుకు ధైర్యం ఉందా అని కూడా ఆయన ప్రశ్నించారు.  ఇక మీ త్యాగాలు మాకొద్దు మహా ప్రభో అంటూ బీజేపీ నేతలు దండం పెట్టేస్తున్నారు. ఎన్నో త్యాగాలు మేము ఇంతదాకా చేశాం, ఇక మా వల్ల కాదు అని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఇటీవలే హాట్ హాట్  కామెంట్స్ చేశారు.

ఇక ఇపుడు దీని మీద కాపు ఐక్య వేదిక  నాయకులు అయితే గట్టిగానే చంద్రబాబుని నిలదీస్తున్నారు. త్యాగాలు చేయడం అంటే పవన్ని సీఎం చేయాలి బాబు గారూ అంటూ వారు చెబుతున్నారు. 2014లో జనసేన టీడీపీని గెలిపించడానికి ఎన్నికల్లో పోటీ చేయ‌లేదు అని కూడా గుర్తు చేశారు.

నాడు పవన్ జనసేన చేసిన త్యాగాన్ని వాడేసుకుని 2019 ఎన్నికల్లో పవన్ని ఓడించారని కూడా టీడీపీ మీద మండిపడింది. మళ్లీ మీరు మరోసారు సీఎం అయ్యేందుకు పవన్ జనసేన, బీజేపీ పార్టీలు త్యాగాలు చేయాలా అని నిగ్గదీసింది. అసలు త్యాగం అంటే ఏమిటో చంద్రబాబు అర్ధం చెప్పాలని, స్పష్టత ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది. ఈ మేరకు కాపు ఐక్య వేదిక నాయకులు బాబును గట్టిగానే అడుగుతున్నట్లుగా ఉంది.

మొత్తానికి పవన్ మెత్తబడి పొత్తులకు సిద్ధమైనా బాబు తరువాత సీట్లో కూర్చోవాలనుకున్నా కాపు సంఘం నేతలు మాత్రం ఈ రకమైన త్యాగాలకు ఏ కోశానా ఊరుకునేది లేదని ఖరాకండీగానే చెబుతున్నారు. మరి త్యాగం అన్న పెద్ద మాట వాడేసిన బాబు దాని అర్ధాలు పరమార్ధాలు కాపు నేతలతో పాటు ఏపీలోని రాజకీయ పార్టీలకు అర్ధమయ్యేలా వివరిస్తారా.
Tags:    

Similar News