వాళ్లంద‌రికీ మంత్రి ప‌ద‌వుల‌ట‌..సాధ్య‌మేనా సీఎం గారూ?

Update: 2019-12-10 16:11 GMT
ఇప్ప‌టికే య‌డియూర‌ప్ప మంత్రివ‌ర్గం గురించి ర‌చ్చ సాగుతూ ఉంది బీజేపీలో. క‌నీసం ఎమ్మెల్యేగా నెగ్గ‌ని ఒక‌రిద్ద‌రిని మంత్రుల‌ను చేశారు. వారిలో ఒక‌రికి ఉప‌ముఖ్య‌మంత్రి హోదానూ ఇచ్చారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ఒక నేత‌ను అలా ఉప‌ముఖ్య‌మంత్రిని చేసింది బీజేపీ. అదేమంటే కుల స‌మీక‌ర‌ణాల కోస‌మ‌ని తెలుస్తోంది. అందునా స‌ద‌రు నేత అసెంబ్లీలో బ్లూఫిలింలు చూస్తూ దొరికిపోయిన బాప‌తు!

అలాంటి ప‌రిస్థితుల్లో య‌డ్డి కేబినెట్లో త‌మ‌కు చోటు ద‌క్క‌లేద‌ని ఇటీవ‌లే ఆ ప్ర‌భుత్వం ఏర్ప‌డికప్పుడు  అనేక మంది నేత‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అయితే ఎవ‌రైనా అలిగితే వారి మీద అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానంటూ య‌డియూర‌ప్ప వారంద‌రికీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో నేత‌లంతా కామ్ అయ్యారు.

అలా మంత్రి ప‌ద‌వులు అడిగిన వారికి ఝ‌ల‌క్ ఇచ్చిన య‌డియూర‌ప్ప ఇప్పుడు మ‌రో ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ఉప ఎన్నిక‌ల్లో నెగ్గిన ప‌న్నెండు మందికి మంత్రి ప‌ద‌వులు అని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో  ఆ మేర‌కు ప్ర‌చారం చేసిన య‌డియూర‌ప్ప‌.. ఇప్పుడు ఆ మాట‌ను నిల‌బెట్టుకోవ‌డ‌మే అంటున్నారు.

ఈ విష‌యం గురించి మోడీ, అమిత్ షాల‌తో చ‌ర్చించ‌బోతున్న‌ట్టుగా.. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉండ‌బోతోందంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే  ఇప్ప‌టికే ప‌లువురు అసంతృప్తితో ఉన్నారు. మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌లేద‌ని వారు వాపోతున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చిన ప‌న్నెండు మందికి ప‌ద‌వులు ఇస్తే పాత వాళ్లు ఊరికే ఉంటారా? అనేది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

వారికి తాను హామీ ఇచ్చిన‌ట్టుగా, వారిని మంత్రుల‌ను చేయ‌బోతున్న‌ట్టుగా య‌డియూర‌ప్ప ప్ర‌క‌టించారు. అంతే కాద‌ట‌.. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ తిరుగుబాటు నేత‌ల‌కు కూడా త‌గిన ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌బోతున్న‌ట్టుగా క‌ర్ణాట‌క‌ సీఎం ప్ర‌క‌టించారు!


Tags:    

Similar News