కెమెరామ‌న్ ను క‌త్తితో పొడిచిన కోడైరెక్ట‌ర్‌

Update: 2018-01-24 05:26 GMT
ఇదో చిత్ర‌మైన ఉదంతం. చ‌దివినంత‌నే అయ్యో అనిపించే వైనం. అపోహ‌తో హ‌త్యకు దిగ‌టం ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ లో బాధితుడు ఇప్పుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తుల ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇద్ద‌రిలో ఒక‌రు అసిస్టెంట్ కెమెరామ‌న్ కాగా.. మ‌రొక‌రు కో డైరెక్ట‌ర్‌. ఇంత‌కీ వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది అన్న‌ది తెలుసుకునే ముందు కాస్త బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే..

తూర్పు గోదావ‌రి జిల్లా ముమ్మ‌డివ‌రం మండ‌లం అయిన‌పురం గ్రామానికి చెందిన రాజు అలియాస్ వ‌ర్మ యూట్యూబ్ ఛాన‌ల్ లో అసిస్టెంట్ కెమెరామ‌న్ గా ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది డిసెంబ‌రులో సినీ ప‌రిశ్ర‌మ‌లో కోడైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్న రాంరెడ్డి ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఇందిరాన‌గ‌ర్‌ లో ఉండే ఇత‌డు.. వ‌ర్మ‌ను త‌న‌తో పాటు గ‌దిలో క‌లిసి ఉండాల‌ని కోరాడు. దీనికి ఓకే అన్నాడు.

రాంరెడ్డికి చిత్ర‌మైన అల‌వాటు ఉంది. త‌ర‌చూ నిద్ర లేచి త‌న‌ను ఎవ‌రో చంప‌టానికి వ‌స్తున్న‌ట్లుగా క‌ల‌వ‌రించేవాడు. ఒక‌సారి అయితే ఏకంగా 108కి ఫోన్ చేసి చెప్పాడు. విచార‌ణ‌లో అత‌గాడు అపోహ‌కు గురి అవుతుంటాడ‌ని తేల్చారు. ఇదిలా ఉండ‌గా.. తాజాగా అర్థ‌రాత్రి ఒంటి గంట ప్రాంతంలో డాబా మీద ప‌డుకున్న వ‌ర్మ‌పై రాంరెడ్డి క‌త్తితో దాడి చేశాడు. త‌ప్పించుకునే క్ర‌మంలో రెండు చేతుల‌కు గాయాల‌య్యాయి. ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని పారిపోయే ప్ర‌య‌త్నం చేయ‌గా క‌త్తితో చేసిన దాడికి కిడ్నీ ప్రాంతంలో గాయాల‌య్యాయి. రాంరెడ్డి నుంచి త‌ప్పించుకొని ఒక ఏటీఎం సెంట‌ర్ వ‌ద్ద దాక్కున్నాడు.

ర‌క్తం విప‌రీతంగా పోవ‌టంతో స్పృహ త‌ప్ప ప‌డిపోయాడు. పొద్దున్నే ఏటీఎంకు వ‌చ్చిన వారు వ‌ర్మ‌ను చూసి పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వటంతో.. అత‌డ్ని ఆసుప‌త్రికి చేర్చారు. ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు రాంరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Tags:    

Similar News