పడవలో వచ్చింది పాక్ ఉగ్రవాదులేనా?

Update: 2016-10-02 11:35 GMT
ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు.. మరో పక్క దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు.. ఏ క్షణాన్నైనా ఉగ్రమూకలు ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చనే ఐబీ సందేహాలు.. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ కు చెందిన పడవ ఒకటి గుజరాత్ సమీపంలో భారతదేశ పరిధిలోకి ప్రవేశించింది. దీంతో భారత గస్తీ దళం ఆ పడవను పట్టుకుంది. ఆ పడవలో ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

గుజరాత్ తీరంలో విధులు నిర్వహిస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ కు భారత జలాల్లోకి పాక్ పడవ రావడం కనిపించింది. అంతే వెంటనే దాన్ని చుట్టుముట్టారు. ఆ తర్వాత పడవలో ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. భారత జలాల్లోకి వీరెందుకు ప్రవేశించారు? వీరి లక్ష్యాలేంటి? వీరికి ఉగ్రవాద సంబందాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలపై అధికారులు విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మన సైనికుడు చందులాల్ చౌహాన్ ని పాక్ పట్టుకుంది. అయితే అతని విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇప్పటికే వెల్లడించారు. ఇదే సమయంలో భారత్ లోకి ప్రవేశించిన తొమ్మిదిమంది ఇప్పుడు భారత్ చేతిలో ఉండటం గమనార్హం.

కాగా, గతంలో కూడా గుజరాత్ తీరానికి ఇలాగే పాక్ పడవ ఒకటి కొట్టుకొచ్చింది. అందులో భారీగా పేలుడు పదార్ధాలు కూడా ఉన్నాయి. ఆ తరుణంలో ఆ పడవను సముద్రంలోనే పేల్చేశారు కూడా. అలాగే 2008 నవంబర్ 26 దాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాదులు కూడా పడవ ద్వారానే సముద్రమార్గం నుంచి భారత్‌లోకి ప్రవేశించి 166మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ గతానుభవాలన్నీ దృషిటిలో పెట్టుకున్న అధికారులు ఆ మేరకు విచారణ చేస్తున్నారట!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News