సోష‌ల్ మీడియా హీరోలు ఈ క‌లెక్ట‌ర్‌..ఎస్పీలు!

Update: 2017-12-26 09:27 GMT
అత్యున్న‌త స్థానాల్లో ఉంటే ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారికి ఇప్పుడు కొద‌వ‌లేదు. అధికారాన్ని దుర్వినియోగం చేయ‌టంలో ఎవ‌రికి వారు పోటాపోటీ ప‌డుతున్న రోజులివి. ఇందుకు భిన్నంగా.. స్ఫూర్తివంతంగా నిల‌వ‌ట‌మే కాదు.. త‌న తీరుతో అంద‌రి మ‌న‌సుల్ని దోచుకున్న ఈ క‌లెక్ట‌ర్.. ఎస్పీల‌ గురించి తెలుసుకోవాల్సిందే. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు రియ‌ల్ హీరోలుగా వైర‌ల్ అవుతున్న వీరి తీరు స్ఫూర్తివంతంగా ఉండ‌ట‌మే కాదు.. ఆద‌ర్శంగా నిలుస్తున్నారు కూడా.

వీరి గురించి  తెలిసిన త‌ర్వాత‌.. మ‌న‌కూ ఇలాంటి క‌లెక్ట‌ర్.. ఎస్పీలు ఉంటే ఎంత బాగుండు అనుకోకుండా ఉండ‌లేరు. ఇంత‌కీ ఈ క‌లెక్ట‌ర్.. ఎస్పీలు ఏం చేశారు?  వారిని అంత గొప్ప‌గా ఎందుకు పొగుడుతున్న‌ట్లు? అన్న క్వ‌శ్చ‌న్ల‌కు ఆన్స‌ర్లు వెతికితే..

త‌మిళ‌నాడులోని తిరువ‌ణ్ణామ‌లై జిల్లా క‌లెక్ట‌ర్ పేరు కంద‌స్వామి. చాలామంది క‌లెక్ట‌ర్ల‌కు భిన్న‌మైన ధోర‌ణి ఆయ‌న సొంతం.  పెద్ద స్థాయిలో ఉంటూ కూడా సాదాసీదాగా ఉంటారు. న‌లుగురికి మంచి చేయాల‌ని తెగ త‌పిస్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌నో కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

తిరువ‌ణ్ణామ‌లై జిల్లాకు చెందిన ఒక ప్రైవేటు షూ కంపెనీ  వినూత్నంగా ఒక ప్రోగ్రామ్ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా టెన్త్ ప‌రీక్ష‌లో అత్య‌ధిక మార్కులు సాధించిన వారికి బ‌హుమ‌తులు అందించి.. వారిని ప్రోత్స‌హించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. దీనికి క‌లెక్ట‌ర్ హాజ‌ర‌య్యారు. చెయ్యారులో ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప్ల‌స్ టూ చ‌దువుతున్న మోనిషా అనే విద్యార్థినికి గ‌త ఏడాది టెన్త్ ప‌రీక్ష‌ల్లో 500 మార్కుల‌కు 491 మార్కులు సాధించి టాప‌ర్ గా నిలిచింది. ఆమెను ప‌రిచ‌యం చేస్తూ నిర్వాహ‌కులు.. మోనిషాకు క‌లెక్ట‌ర్ కావాల‌న్న ఆశ‌యంతో ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

కార్య‌క్ర‌మం పూర్తి అయ్యాక‌.. ఆమెను పిలించిన క‌లెక్ట‌ర్ కంద‌స్వామి.. ఆమెను త‌న అధికారిక కారులో కూర్చోబెట్టారు. త‌ను డోర్ ద‌గ్గ‌ర విన‌యంగా చేతులు క‌ట్టుకొని నిలుచున్నారు. త‌న సీటులో కూర్చోబెట్టిన క‌లెక్ట‌ర్‌.. ఆ అమ్మాయి ఫోటోను తీసి.. ఆమెకు అందించారు.

క‌లెక్ట‌ర్ కావాల‌న్న ఆశ‌యం నెర‌వేరే వ‌ర‌కూ ఆ ఫోటోను స్ఫూర్తి కోసం ఉంచుకోవాల‌ని చెప్పారు. ఓ జిల్లా క‌లెక్ట‌ర్ అయి ఉండి.. ఒక విద్యార్థిని క‌ల‌ను నిజం చేయ‌టం కోసం.. ఆమెలో స్ఫూర్తిని నింపేందుకు త‌న కారులో.. తన సీట్లో కూర్చోబెట్టి ప్రోత్స‌హించిన వైనానికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. క‌లెక్ట‌ర్ తీరును తెగ మెచ్చేసుకుంటున్నారు. క‌లెక్ట‌ర్ అయ్యే క్ర‌మంలో శిక్ష‌ణ‌కు సంబంధించిన ఎలాంటి సాయాన్ని అయినా త‌న‌ను సంప్ర‌దించాల‌న్నారు. ఒక  టాప‌ర్ ను మ‌రింత ఎదిగేలా చేయ‌టం కోసం క‌లెక్ట‌ర్ ప‌డిన త‌ప‌న స్ఫూర్తిదాయ‌క‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

క‌లెక్ట‌ర్ ముచ్చ‌ట ఇలా ఉంటే.. ఒక పోలీస్ బాస్ తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. రియ‌ల్ హీరోగా ఆయ‌న్ను కీర్తిస్తున్నారు. క‌ర్ణాట‌క‌కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి సోష‌ల్ మీడియా సంచ‌ల‌నంగా మారారు. ఎందుక‌లా అంటే.. క‌ర్ణాట‌క‌లోని చిక్ మ‌గ‌ళూరు జిల్లా ఎస్పీ అణ్ణామ‌లై.. విధి నిర్వ‌హ‌ణ‌లో చురుగ్గా ఉంటార‌న్న పేరు ఆయ‌న సొంతం. తాజాగా బెంగ‌ళూరుకు చెందిన కొంద‌రు వీకెండ్ లో చిక్క‌మ‌గ‌ళూరుకు వ‌చ్చారు. త‌మ ట్రిప్ ను ఎంజాయ్‌ చేస్తూ తిరిగి వెళుతున్నారు. అయితే.. అర్థ‌రాత్రి వేళ వారు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం మ‌త్తావ‌ర గ్రామం స‌మీపంలో పంచ‌ర్ ప‌డింది. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం కావ‌టం.. చిమ్మ చీక‌టిగా ఉన్న ఆ ప్రాంతంలో ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోయారు. అలాంటి టైంలో విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా అక్క‌డికి ద‌గ్గ‌ర్లోని కొప్ప గ్రామానికి విజిట్ గా వెళ్లిన ఎస్పీ అణ్ణామ‌లై.. తిరిగి వెళుతున్నారు. రోడ్డు మీద నిలిచిన వాహ‌నాన్ని గుర్తించారు. విష‌యం తెలుసుకున్న ఆయ‌న‌.. తానే స్వ‌యంగా స్పాన‌ర్ ప‌ట్టుకొని టైర్  మార్చే ప్ర‌య‌త్నం చేశారు. అయిన‌ప్ప‌టికీ అది సాధ్యం కాక‌పోవటంతో తానే స్వ‌యంగా ఒక మెకానిక్ కు ఫోన్ చేసి కారు రిపేర్ చేయాల‌ని కోరారు. అనంత‌రం టూర్‌ కు వ‌చ్చిన వారిని చిక్ మ‌గ‌ళూరులో విడిచి వెళ్లారు. ఇబ్బందుల్లో ఉన్న‌వారిని గుర్తించ‌ట‌మే కాదు.. వారికి సాయం చేసి.. ఇబ్బందుల నుంచి త‌ప్పించ‌టానికి ఎస్పీ చేసిన ప్ర‌య‌త్నం సోష‌ల్ మీడియాలో రావ‌టంతో ఇప్పుడాయ‌న అంద‌రి అభినంద‌న‌లు అందుకుంటున్నారు.


Tags:    

Similar News