టాలీవుడ్ జ‌గ‌న్ వైపు చూస్తోందా..

Update: 2018-05-12 10:52 GMT
సినీ పరిశ్రమకు రాజకీయాలకు ఉన్న బంధం ఎలాంటిదో తెలిసిందే. సినిమా వాళ్లు రాజకీయాలపై ఆసక్తి చూపించడం.. తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం.. ఏదో ఒక పార్టీకి మద్దతు ప్రకటించడం.. ప్రచారాలు చేయడం.. అవసరమైతే ఎన్నికల బరిలోనూ నిలవడం ఎప్పట్నుంచో ఉన్నదే. ఇంకో ఏడాది లోపు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సినీ పరిశ్రమలో రాజకీయ వేడి రాజుకుంది. సినీ జనాలు పార్టీల వారీగా విడిపోతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి తెలుగు దేశం పార్టీ పట్ల పరిశ్రమలో వ్యతిరేకత కనిపిస్తోంది.  టీడీపీకి ఇంతకుముందు మద్దతుగా నిలిచిన వాళ్లలో ఆల్రెడీ కొందరు జనసేన వైపు మళ్లారు.

ఇంకొందరు వైఎస్సార్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత.. నటుడు పోసాని కృష్ణమురళి జగన్ కే తన మద్దతంటూ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కమెడియన్ పృథ్వీ వచ్చే ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పడం విశేషం.

శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కొత్త పేటలో తన మిత్రుడు.. పండితుడు పెద్దింటి రామం ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడాడు పృథ్వీ. ‘‘నేను 2014 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శిగా పని చేస్తున్నాను. విజయనగరం.. విశాఖపట్నం.. శ్రీకాకుళం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించను. గత ఎన్నికల్లో కొత్త రాష్ట్రం.. చంద్రబాబు సీనియారిటీ చూసి రుణమాఫీ హామీని నమ్మి జనాలు ఓట్లేశారు. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సంతోషంగా స్వీకరించాం. నాలుగేళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉందో ప్రజలు గమనించారు. ఆయనపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. దీంతో ప్రజల దృష్టి జగన్ వైపు మళ్లింది. ఆయన పాలన కోరుకుంటున్నారు. ప్రజల సమస్యలు.. ఇబ్బందులు గుర్తించేందుకు ఎండనక వాననక ఆరోగ్యం గురించి లెక్క చేయకుండా జగన్ గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోరుకునే ఎన్టీఆర్.. వైఎస్‌ ల పాలన చూశాం. మళ్లీ అలాంటి పాలన అందించగల జగన్ ను సీఎంగా చూస్తామన్నది నా ప్రగాడ నమ్మకం’’ అని పృథ్వీ అన్నాడు.

Tags:    

Similar News